– ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’తో రాష్ట్ర పోలీసులు మార్క్
– రాష్ట్రవ్యాప్తంగా 1,888 మ్యూల్ ఖాతాల గుర్తింపు..
– 208 మంది అరెస్ట్
-వారిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు
– వివరాలు వెల్లడించిన టిజిసి ఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాలకు సహకరిస్తూ అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌లనే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరుతో భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తం గా ఏకకాలంలో నిర్వహించిన ఈ దాడుల వివరాలను ఆమె వెల్లడిస్తూ, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి తెలంగాణలో ప్రారంభమై న అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తిం చామని చెప్పారు. మొత్తం 512 మంది సిబ్బందితో కూడిన 137 పోలీసు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 బ్యాంక్ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయని, ఈ తనిఖీల్లో దేశవ్యాప్తంగా సుమారు 9,451 నేరాలతో సంబంధం ఉండి, దాదాపు రూ.100 కోట్ల నష్టానికి కారణమైన 1,888 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ధృవీకరించినట్లు ఆమె వివరించారు. ఈ ఆపరేషన్ ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 549 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 626 మంది అనుమానితులను గుర్తించగా, అందులో 208 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో సామాన్యులే కాక 15 మంది మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగితోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉండటం గమనార్హమని శిఖా గోయల్ వెల్లడించారు. వీరంతా తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ మోసగాళ్లకు అద్దెకు ఇచ్చి ప్రతి లావాదేవీపై 5 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్లు విచారణలో తేలిందని, వీరి నుంచి 63 మొబైల్ ఫోన్లు, 208 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వయస్సు 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉందని, సమాజంలోని వివిధ వర్గాల వారు ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆకర్షితులవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జూబ్లీహిల్స్ మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు చెందిన ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరవడంలో సహకరించినందుకు వారిని కూడా అరెస్టు చేశామని, వరంగల్‌లో ఒక నిందితుడు తన కుటుంబ సభ్యుల ఖాతాలనే మోసాలకు వేదికగా మార్చుకున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్త సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, బాధితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని డైరెక్టర్ స్పష్టం చేశారు. వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు వీలు కల్పించే సెక్షన్ 112 బిఎన్ఎస్ ను ఈ కేసుల్లో ప్రయోగించామని, దేశంలోనే ఈ సెక్షన్‌ను ఇంత పెద్ద ఎత్తున వినియోగించడం ఇదే మొదటిసారి అని ఆమె వివరించారు. ఖాతాలు తెరవడానికి సహకరించే ఫెసిలిటేటర్లు, సిమ్ కార్డులు సమకూర్చేవారు, ఏటీఎం వివరాలు సేకరించేవారిని గుర్తించి వారిపై కూడా నిఘా పెంచామని, సైబర్ నేరగాళ్ల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలెవరూ తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, కమీషన్ల కోసం ఖాతాలను అద్దెకు ఇవ్వడం నేరమని, దీనివల్ల కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శిఖా గోయల్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




