– సెప్టెంబర్ 17పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివరణ
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్16:సెప్టెంబరు 17 తెలంగాణ విలీన దినమేనని.. విముక్తి దినం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. కానీ బీజేపీ వారు దీన్ని ముస్లింలపై సాధించిన విజయంగా చూపడానికి విముక్తి దినంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ విలేఖర్లతో మాట్లాడారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన తెలంగాణ సాయుధపోరాటంలో నాలుగున్నర వేల మంది చనిపోయారని చెప్పారు. కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువచేసి చూపే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పటేల్‌ను ఉపయోగించుకొని కమ్యూనిస్టుల ఉద్యమాన్ని తక్కువగా చూపించే కుట్రను అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. మగ్దూం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో సెప్టెంబరు 11న తెలంగాణ సాయుధపోరాటం ప్రారంభమైన తరుణంలో నిజాం నవాబు సెప్టెంబరు 17న విధిలేక కేంద్రానికి లొంగిపోయారని పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా ఆనాడు విలీనం జరిగిందన్నారు. అందుకే దాన్ని తాము విలీనదినంగానే ప్రకటిస్తున్నామని నారాయణ చెప్పారు. దీనిని చిలువలు పలువలుగా చేసి బిజెపి రాజకీయ లబ్ది కోసం పాకులాడుతోందన్నారు. కమ్యూనిస్టులు ఆనాడు చూపిన తెగువ మరువలేనిదన్నారు. భారత్‌లో నిజాం యూనియన్ విలీనం అయ్యిందన్నది వాస్తవమని నారాయణ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





