వివాదరహితంగా నీటి సమస్య పరిష్కారం

-పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాకనే బనకచర్లపై ఆలోచించాలి
-ఇరు రాష్ట్రాల సిఎంలతో భేటీకి కేంద్రం చొరవ మంచిదే
-తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్‌
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై18: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కారానికి సంబంధించి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నీటి అంశాలను కావాలనే రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలని సూచించారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్‌ అన్యాయం చేయడంలేదని, ఆయనపౖౖె విమర్శలు మానుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తరువాత సెంటిమెంట్‌ ఎగిరిపోయిందని.. ఇప్పుడు ఏ సెంటిమెంట్లూ లేవంటూ వ్యాఖ్యానించారు. కాగా, పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల అంశాన్ని అనవసరంగా తెరపైకి తీసుకొచ్చారని ఏపీ సీఎంను దుయ్యబట్టారు. బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశధార వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నారాయణ గతంలో డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. నీటి ప్రాజెక్టుల గురించి సీపీఐ ఎప్పుడూ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతిమయం అయిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, రాష్ట్రం, కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారని, బనకచర్ల గురించి మొదట మాట్లాడాల్సింది తెలంగాణ ముఖ్యమంత్రితో అని, అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ సీఎం వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *