– బీజేపీ కట్టడికి కలిసి రండి
– సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్
ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిటారుగా నిలబడి కొట్లాడుతోందని, కామ్రేడ్ సోదరులను మనసారా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పేదల కోసం ప్రభుత్వాలపైనే యుద్ధాలు చేశారని, దున్నేవానిదే భూమి అనే నినాదంతో భూస్వాముల నుంచి భూములను పేదలకు పంచేలా చేశారని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటూ నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవాలని అన్నారు. నిజాం రజాకార్లను తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల్ల గిరిప్రసాద్‌లు పేదల కోసం పోరాటం చేశారని చెప్పారు. దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతున్న కూలీల కోసం పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, రైతు కూలీల కోసం చట్టాలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. 1925 డిసెంబర్‌లో యూపీలోని కాన్పూర్‌లో ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. రాబోయే వందేళ్లు కూడా పేదలు, గిరిజనుల కోసం కొట్లాడతాం.. అవసరమైతే తుదిశ్వాశ వదులుతామే తప్ప ఎర్రజెండాను మాత్రం వదలం అనడానికి ఖమ్మం శతాబ్ది ఉత్సవాలే నిదర్శనమని అన్నారు. కమ్యూనిస్టులను ఆదర్శంగా తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టాం అని సీఎం రేవంత్ అన్నారు. ‘ఆనాడు బ్రిటిష్ వాళ్లతో ఎంత ప్రమాదమో.. ఇప్పుడు బీజేపీతోనూ అంతే ప్రమాదముందని వ్యాఖ్యానించారు. నాడు జాతీయ ఉపాధి హామీ చట్టానికి కాంగ్రెస్ తీసుకొస్తే ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేసి గ్రామాల్లో వలసలకు బీజేపీ కారణమైందని విమర్శించారు.
అందరం కలిసి బీజేపీని కట్టడి చేద్దాం
బీజేపీ అంటే బ్రిటిష్ పాలనా పార్టీ అని, అది విభజించి పాలిస్తోందని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు కావాలని అడిగిందని, ఆ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు పోతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశమంతా ప్రచారం చేయడంతో ఆ పార్టీ 240 సీట్ల వద్ద ఆగిందని వివరించారు. పరిపాలనలోకి వచ్చాక రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. పేదల వ్యతిరేక పార్టీ బీజేపీ అంటూ ఓటు తొలగిస్తే సంక్షేమ పథకాలు పోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు ఏకమవ్వాలంటూ ఎర్రజెండా సోదరులు పిలవగానే వచ్చానని, మీరు పోరాడే వాటికి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసి వచ్చినా రెండు సర్పంచ్ స్థానాలను గెలిపించలేరు అంటూ వ్యంగ్యంగా అన్నారు. అందరం కలిసి బీజేపీని కట్టడి చేద్దాం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం అని కమ్యూనిస్టులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





