– వృధ్ధాశ్రమంలో వృద్దులకు పరామర్శ
– నటి పావలా శ్యామలకు ఆత్మీయ పలకరింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వినూత్నంగా జరుపుకొన్నారు. ఓ వృద్దాశ్రమాన్ని సందర్శించి అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఈ విషయాన్ని ఆయన ’ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్దాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48మంది పెద్దల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలని పరామర్శించాను. కష్టకాలంలో ఉన్న ఆమెను ఆదుకుని ఈ హెల్త్‌కేర్ సెంటర్‌లో చేర్పించిన తిరుమలగిరి ఏసీపీ రమేష్ చొరవ అభినందనీయమని ప్రశంసించారు. 18 ఏళ్లుగా వేలమందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్న డాక్టర్ రామకృష్ణ సేవ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా నాదొకటే విన్నపం.. వృద్దాశ్రమాలు లేని సమాజం రావాలి. మనల్ని కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల రుణం ఎంత చేసినా తీరనిది. ఆధునిక జీవనశైలి, ఒత్తిళ్ల సాకుతో వారిని వృద్దాశ్రమాలకు పరిమితం చేయొద్దు. చరమాంకంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదు.. పిల్లల ఆప్యాయత, నాలుగు తీపి మాటలు మాత్రమే. తల్లిదండ్రులను భారంగా కాకు బాధ్యతగా, దైవంగా భావిద్దాం. వారి సేవలోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




