దేశం, ధర్మం రెండు కళ్ల వంటివి

– జాగ్రత్తగా కాపాడుకోవాలి
– కష్టాలను జయించినవారికే విజయం దక్కుతుంది
– శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర భారతి మహాస్వామి

న్యూదిల్లీ, నవంబర్‌ 25: దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్ల వంటివని.. ఈ రెండిరటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర భారతి స్వామి సూచించారు. దిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అధికారిక నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం వారు అనుగ్రహభాషణం చేశారు. ప్రజలు బాధ్యతతో నడుచుకుంటూ, కర్తవ్యపాలన చేస్తే అనుకున్న విజయాలను సాధించవచ్చన్నారు. దేశాన్ని గౌరవించుకుంటూనే ధర్మాన్ని కాపాడుకోవాలని ఉద్బోధించారు. వేల ఏళ్ల నాటి సనాతన చరిత్ర కలిగిన ఈ దేశంలో పుట్టడం ఎన్నో జన్మజన్మల అదృష్టమన్నారు. అందుకే ఈ దేశానికి సేవ చేసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమన్నారు. ఇందుకోసం సత్సంకల్పంతో పనిచేయాలన్నారు. ఏ విషయంలోనైనా విజయాలు సాధించాలనుకుంటే ముందుగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, అప్పుడే రాటుదేలి ఉన్నతస్థానాలకు చేరుకున్న తర్వాత ఉత్తమంగా పనిచేసేందుకు వీలవుతుందని విదుశేఖర భారతి అన్నారు. భగవంతుడు కూడా పనిచేసే తత్వం, కష్టపడే తత్వం ఉన్నవారినే పరీక్షిస్తారన్నారు. ఇవాళ కేంద్ర మంత్రులుగా, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చాలా కష్టపడ్డాకే ఈ స్థాయికి వచ్చారన్నారు. అందుకే ఎవరికీ ఏదీ కష్టపడకుండా దక్కదని మహా స్వామీజీ సెలవిచ్చారు. పీఠం కింద కూర్చున్న వారికి పీఠం మాత్రమే కనబడుతుందని, కానీ ఆ పీఠంపైన కూర్చున్నవారికి అక్కడినుంచి చేయాల్సిన కర్తవ్యం మాత్రమే కనబడుతుందన్నారు. పాద సేవలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, కేంద్ర మంత్రులు సర్బానంద్‌ సోనోవాల్‌, అన్నపూర్ణాదేవి, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ భాయ్‌ మాండవీయ, సీఆర్‌ పాటిల్‌, సతీశ్‌ చంద్రదూబే, ధిల్లీి మంత్రి ఆశిష్‌ సూద్‌తోపాటు పలువురు రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *