ఫెమినిజంలో పితృస్వామ్య వ్యవస్థ జెండర్ ప్రాతిపదికన జరిపే అణిచివేతను వ్యతిరేకిస్తే, అదేవ్యవస్థలో మనుషులను అందరిని ఆడ-మగా అనే బైనరీ ఉనికిలో (హెటెరోనోర్మటివిటీ) నిర్బంధిస్తున్నందుకు వ్యతిరేకంగా క్వియర్ పోరాటం పనిచేస్తుంది. ఈ అణిచివేతలు తరతరాలుగా వ్యవస్థీకృతమైనవి, బలమైనవి, అణగదొక్కేవి. పైగా వీటికి కుల, మత, ఆర్ధిక, శారీరకసామర్ధ్య సూచికలు- ప్రతివ్యక్తికీ దక్కే అధికారం, పీడనలను ధృవీకరిస్తూ సాగుతాయి. ఈ సూచికలు రెండుపోరాటాలలోనూ కనిపిస్తాయి. అందువలన ఫెమినిజం క్వియర్ అంశాన్ని సహానుభూతితో చూస్తుంది. కానీ రెండూ ఒకటి కాదనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి.
– కె ఎన్ మల్లీశ్వరి
● ఫెమినిజం- క్వియర్ అంశాన్ని ఎటువంటి సహానుభూతితో చూస్తుంది?
ఫెమినిజం ఇంకా పూర్తిగా క్వియర్ అంశాన్ని స్వంతం చేసుకోలేదు, కానీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఫెమినిజంలో పితృస్వామ్య వ్యవస్థ జెండర్ ప్రాతిపదికన జరిపే అణిచివేతను వ్యతిరేకిస్తే, అదేవ్యవస్థలో మనుషులను అందరిని ఆడ-మగా అనే బైనరీ ఉనికిలో (హెటెరోనోర్మటివిటీ) నిర్బంధిస్తున్నందుకు వ్యతిరేకంగా క్వియర్ పోరాటం పనిచేస్తుంది. ఈ అణిచివేతలు తరతరాలుగా వ్యవస్థీకృతమైనవి, బలమైనవి, అణగదొక్కేవి. పైగా వీటికి కుల, మత, ఆర్ధిక, శారీరకసామర్ధ్య సూచికలు- ప్రతివ్యక్తికీ దక్కే అధికారం, పీడనలను ధృవీకరిస్తూ సాగుతాయి. ఈ సూచికలు రెండుపోరాటాలలోనూ కనిపిస్తాయి. అందువలన ఫెమినిజం క్వియర్ అంశాన్ని సహానుభూతితో చూస్తుంది. కానీ రెండూ ఒకటి కాదనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫెమినిజం మౌలిక సూత్రాలైన సమానత్వ సాధనే క్వియర్ పోరాటంలో కూడా చూస్తాము. సమానత్వ ఆకాంక్ష ఈ రెండు పోరాటాల ఉద్దేశం కాబట్టి ఇవి కలిసేచోటును ‘క్వియర్ ఫెమినిజం’ అంటాము. క్వియర్ ఫెమినిజం వ్యక్తిగత గౌరవాన్ని పెంచి, తరాలుగా పాతుకుపోయిన జెండర్ వివక్ష, హింస, అసమానతకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
● క్వియర్ ఇతివృతంతో వచ్చిన భిన్నరచయితల కథలను సంకలనం చేయాలని ఎందుకు అనిపించింది?
అస్తిత్వవాద రచనలు సంకలనంగా రావడం వలన వచ్చే లాభాలను స్పష్టంగా చూస్తూ ఉన్నాను. అవి చదవడం వలన పాఠకుల చూపు ఇంకా లోతుగా మారుతుంది, అవగాహన పెరుగుతుంది. చారిత్రాత్మకంగా, భాషాపరంగా, కల్చరల్ గా- అక్కడి రీతి-రివాజులు, వేసుకునే బట్టలు, పండుగలు, అక్కడి దేవుళ్ళు, నమ్మకాలూ వంటివి. వివిధ అస్తిత్వాలు పాటించే ఆచారాలు, భాషాప్రయోగాలకు- ప్రాంతీయత, వాతావరణం, ఆహారపుటలవాట్లు, అక్కడి ట్రామా (కరువు, వరదలు, ముంపు) కూడా కారణమవుతుంటాయి. ఇవన్నీ విజ్ఞానాన్నే కాక, ఒక్కో అస్తిత్వపు ప్రత్యేకతను, వారి రాజకీయ అవసరాలను తెలియజేస్తాయి. ఇటువంటి సాహిత్యం Socio economic political research కి ఎంతో దోహదం చేస్తుంది. ఇటువంటి సమయంలో ఇంకా రాని అస్తిత్వాల వైపు చూడాలనుకున్నాను. నేనున్న రంగంలో క్వియర్ అంశాలపై చర్చ, advocacy జరుగుతుండేది. ఒక బైనరీ కళ్లద్దాలు దాల్చిన రచయిత లోకం ఎలా చూస్తోంది అనే ఉత్సుకతతో ఈ పని ఆరంభించాను.
● క్వియర్ కథల వెతుకులాటలో మీరు గ్రహించిన అంశాలు?
తమ కథలు తాము రాసుకునే తీరిక, మనఃశాంతి, భాష, క్వియర్ వ్యక్తుల వద్ద ప్రస్తుతం లేదు. ఐదేళ్ల క్రితం క్వియర్ వ్యక్తులు కాక ఎవరికథలు వారే రాసుకోవాలి అనుకుని రెండురోజుల ఆన్లైన్ వర్క్ షాప్ చేశాం. కోవిడ్ సమయం కాబట్టేమో దాదాపు 25 మంది క్వియర్ వ్యక్తులు అటెండ్ అయ్యారు. తరువాత క్వియర్ కథలు వస్తాయని నమ్మాను. కానీ రాలేదు. తెలుగు రచయితలకు క్వియర్ అంశం మీద పూర్తిగా అవగాహన లేకపోయినా సహానుభూతి ఉంది. కొందరు రచయతలు క్వియర్ బాధ్యతను తలకెత్తుకున్నారు. అవగాహన అవసరమైన విషయాలపై వర్క్ షాప్ లకు హాజరవడం, విస్తృతంగా చదవడం, లేదా ఆ కమ్యూనిటీ వారితో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకోవడం అవసరం. దీనివలన రచనలో ఇంకా లోతు, సాంద్రత పెరుగుతాయి. పాఠకులలో అపోహలు తగ్గి, క్వియర్ వ్యక్తులపై సహానుభూతి పెరుగుతుంది. రచయితలు తమ అస్తిత్వ పోరాటాలలో తమలోనే అణిచివేయబడ్డ వర్గాలను చూస్తున్నారా? ఒకవేళ చూస్తుంటే ఎలా చూస్తున్నారు, ఏమి అర్థం చేసుకున్నారు, ఆ అర్థం చేసుకోవడంలో కాలానుగుణంగా మారిన అంశాలు, దృష్టి సారించే విషయాలు ఏంటి, ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది, రచయితలతో పాటే సమయం కూడా ముందుకు జరిగిందా లేదా, లేదా సమాజమే ముందుకు జరిగిపోతే రచయిత మాత్రమే తనకు తెలియని అంశాలను అర్థం చేసుకోకుండా అక్కడే ఉండిపోయారా? ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంకలనానికి పూనుకున్నాను.
● ఈ కథలు క్వియర్ సమస్యలను, పోరాటాలను ప్రతిబింబిస్తున్నాయా?
దీనికి సరైన సమాధానం పుస్తకం చదివిన క్వియర్ మిత్రులే చెప్పగలరు. నా వరకు అయితే కుప్పిలి పద్మ ‘మౌన’ ఆస్తి- మనుగడ, ఒక విషాదం తరవాత సమాజపు సపోర్ట్ ఎలా మారుతుందో చెబితే, వెంకటకృష్ణ, చైతన్య వారి రోజువారీ కష్టాన్ని గురించి ప్రస్తావించారు. మోహిత రీప్రొడక్టివ్ రైట్స్ గురించి పెరుగుతున్న సాంకేతికతతో పెరిగి నిలుపుకోగలిగిన చిక్కటి ప్రేమకథను రాసింది. మానస రాసిన ఐదు క్వియర్ కథలు- సమ్మతి (consent), ఒప్పుదల (acceptance), మోహం, same-sex మ్యారేజ్- ఇలా ఒక్కోకథ ఒక్కో అంశాన్ని ముందుకు తెచ్చింది, కృష్ణజ్యోతి, పాణిని, రవి మంత్రి అత్యద్భుతమైన కథలు రాశారు. ప్రస్తుత తరానికి ప్రతినిధులు కడలి, లక్ష్మి ప్రియాంక ఆవలివైపు నుండి క్వియర్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి కథలోనూ పోరాటంతో కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి.
● ఈ సంకలనంలోని రచయితలు క్వియర్ అంశాన్ని ఎటువంటి తటపటాయింపు లేకుండా అంగీకరించారా?
అవునని చాలా గర్వంగా చెబుతాను. అంగీకరించపోయుంటే రాసేవారు కారేమో. రెండు మూడుకథలలో అవగాహన లేకపోవడం, లేదా కొద్దిగా ప్రిజుడిస్ కనిపించింది కానీ మిగిలిన అన్నికథలలోను ఎక్కడా తటపటాయింపు కనబడలేదు.
● ఇంతకు ముందు ఇటువంటి ప్రయత్నాలు జరిగాయా, ఇది ఎంతమేరకి సమగ్రం?
ఇలా ఇప్పటిదాకా తెలుగు భాషలో ప్రచురించబడిన క్వియర్ కథలను ఒకచోట పోగుపరచడం జరగలేదు. ఇప్పటికీ అన్నికథలు వచ్చాయని అనుకోను- తప్పకుండ కొన్నికథలు మా కనుదప్పి ఉంటాయి. ఇప్పుడు ఈ పుస్తకం బయటకు వచ్చాక ఆ కథలు కూడా తెలుస్తాయి, దీనికి సీక్వల్గా ఎవరో ఒకరం తెస్తామనే నమ్మకంగా ఉన్నాము. ఇదిగాక మరోరకంగా ప్రయత్నం జరిగింది. 2020లోనే రచయిత శమంతకమణి, సమన్విత, ఐద్వా, కోపూరి ట్రస్ట్ ద్వారా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అనే అంశంపై కథల పోటీ నిర్వహించారు. ఆ పోటీలో వచ్చిన కథలలో 19 కథలను ఎంచి, ‘అస్మిత’ సంకలనంగా తీసుకువచ్చారు. ఆ సంకలనంలోని కథల వివరాలు క్వియర్ కథల పుస్తకం చివరలో ఇచ్చాము





