– రాష్ట్రప్రభుత్వ విన్నపాన్ని మన్నించిన సీసీఐ
-కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిలు వెంటనే స్పందించారు
– పత్తి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి
– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. తమ అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను నెలాఖరు వరకు సీసీఐ పొడిగించిందని తెలిపారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కోరినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో పత్తి సాగు ఆలస్యంగా ప్రారంభమవడంతో దిగుబడులు కూడా ఆలస్యంగా మార్కెట్‌కు వస్తున్నాయి. ఈ వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తూ కొనుగోళ్ల గడువును పొడిగించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 45.32 లక్షల ఎకరాలలో పత్తిని సాగు చేయగా 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇప్పటివరకు 8,80,053 మంది రైతుల నుంచి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పటివరకు మార్కెట్ ద్వారా 2.24 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యత ప్రమాణాలు లేని పత్తి కోనుగోలు జరిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 9.99 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ పై మొదట రైతులు, జిన్నర్ల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ యాప్ కి రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ఈ యాప్ ద్వారా రైతులు క్యూలలో నిలబడే అవకాశం లేకుండా సమయపాలన పాటిస్తూ దగ్గరలోని పత్తి కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకునే అవకాశం కలగడంతో పాటు, పత్తి కొనుగోళ్లను రెగ్యులేట్ చేస్తూ, పారదర్శకంగా కొనుగోళ్లను చేపట్టే వెసులుబాటు కలిగిందన్నారు. అదేవిధంగా రైతులకు సమయానికి ఎరువుల పంపిణీకి తమ సర్కారు మొబైల్ యూరియా బుకింగ్ యాప్ ని తీసుకొచ్చిందన్నారు. తద్వారా యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంతో పాటు అధిక నిల్వలను నియంత్రిస్తూ పారదర్శక పంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిందన్నారు. పంట పూర్తిగా మార్కెట్‌కు రాకముందే సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తారనే సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొందని, నాణ్యమైన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందనే భయం రైతుల్లో ఉన్న నేపథ్యంలో మరో 30 రోజులు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మంత్రి తుమ్మల సీసీఐను ప్రత్యేకంగా కోరారు. రాష్ట్రంలోని ప్రతి పత్తి రైతు తన పంటను పూర్తిగా విక్రయించే వరకు కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్‌లకు మంత్రి ఆదేశాలతో వ్యవసాయ శాఖ సెక్రటరీ లేఖ రాశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల గడువు పొడిగించడంతో రైతులకు ఉపశమనం లభించిందని మంత్రి తెలిపారు. . రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



