పత్తి రైతులకు కనీస మద్ధతు ధర లభించాలి

– సీసీఐతో అధికారులు సమన్వయం చేసుకోవాలి
– అక్టోబర్‌ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చెయ్యాలి
– అవసరమున్నచోట కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేయాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పత్తి సేకరణలో ప్రభుత్వ సహకారం అవసరమని, దేశవ్యాప్తంగా ఈ ఏడాది కొన్ని నూతన విధానాలు ప్రవేశపెట్టామని, దానికి తగ్గట్టుగా ప్రభుత్వ సహాయం అందించాలని సీసీఐ ప్రతినిధులు మంత్రిని కోరగా ఆయన పైవిధ:గా స్పందించారు. రోజువారీ క్రయవిక్రయాలు పరిశీలించేందుకు డైరెక్టరేట్‌లో ఒక కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకొని అన్ని సెంటర్లను అనుసంధానించాలన్నారు. రైతుల అనుమానాలు నివృత్తి చేసేందుకు టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని మంత్రి సూచించారు. సీసీఐ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించగా పత్తి ఉత్పత్తి, మార్కెట్‌ ధరల పరిస్థితి, ఎంఎస్‌పీ అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్‌, రైతుల రిజిస్ట్రేషన్‌, స్థానిక కమిటీలు, ఫిర్యాదు పరిష్కారం వంటి అనేక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ప్రస్తుతం మార్కెట్‌ ధరలు ఎంఎస్‌పీ కంటే క్వింటాల్‌కు రూ.1099 తక్కువగా ఉన్నాయని, ఇది రైతులకు ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సీసీఐ సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్‌ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలని, రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను 110 నుండి 122కి పెంచినట్లు వెల్లడిరచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా కొనరావుపేట ఎఎంసీ కేంద్రాన్ని కూడా చేర్చాలని సూచించారు. రైతులకు ఎంఎస్‌పీ చెల్లింపులు పూర్తిగా ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ తర్వాతే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సీసీఐ ప్రవేశపెట్టిన కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా రైతులు స్వయంగా స్లాట్‌ నమోదు చేసుకోవచ్చన్నారు. కౌలు రైతులు కూడా ఓటీపీ ఆధారంగా నమోదు చేసుకునే వీలుంటుందని, అయితే వారి వివరాలు సంబంధిత పట్టాదారు ధ్రువీకరించిన తర్వాతే ఆమోదం పొందుతాయని తెలిపారు. రైతులకు ఎల్‌1, ఎల్‌2 స్లాట్ల ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, అలాకాకుండా నూతన పద్ధతిలో సెంటర్‌కు 10, 15 కి.మి పరిధిలో ఉండేలా సెంటర్‌ను కేటాయించాలని సూచించారు. రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 5779, వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు. సీసీఐ కొనుగోలు విధానంలో కొన్ని మార్పులపై కూడా చర్చ జరిగింది. లింట్‌ శాతం పెంపు, కొరత శాతం లెక్కింపు, జిన్నింగ్‌ మిల్లుల పాల్గొనకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతుల ఎంఎస్‌పీ రక్షణకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. సీసీఐ, మార్కెటింగ్‌ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్‌ విజయవంతమవుతుందని మంత్రి తుమ్మల విశ్వాసం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *