– మహిళా భద్రత, సాధికారతపై కీలక నిర్ణయాలు
– పాఠశాలస్థాయి నుంచే స్వీయరక్షణ శిక్షణ తప్పనిసరి
– మహిళా సంక్షేమంపై ఉన్నతస్థాయి సమీYో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: మహిళల సమగ్ర సంక్షేమం కోసం శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళల అభివృద్ధి, సాధికారత, సమానావకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో ఆమె సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్య, వైద్యం, పోలీస్, అటవీ, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు తమ సూచనలు వెల్లడించారు. అభివృద్ధి, సమాన అవకాశాలు, రక్షణ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకుని అంశాలవారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ లింగ వివక్షను నిర్మూలించి మహిళలకు సమానావకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. లింగ సమానత్వ భావనను బలపరిచే విధంగా పాఠ్యాంశాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని చర్చించారు. ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రైవేటు రంగంలోనూ మెటర్నిటి బెనిఫిట్ యాక్ట్ అమలు వంటి అంశాలపై విధానపరమైన మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక షీ సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు.
పొక్సో, మానవ అక్రమ రవాణా కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు
పొక్సో కేసులు, మానవ అక్రమ రవాణా బాధితుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. పాఠశాలస్థాయి నుంచే స్వీయరక్షణ శిక్షణను తప్పనిసరి చేయడం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరాన్ని మంత్రి సీతక్క ప్రస్తావించారు. పాఠశాలలు, హాస్టళ్లలో కిశోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత వంటి సమస్యలను ముందుగానే గుర్తించాలని సూచించారు. అదనపు పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలని నిర్ణయించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే టీనేజీ బాలికల మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా మంచిచెడులపై అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మహిళా సంక్షేమానికి, ఆర్దిక సాథికారతకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్నారు. థియేటర్లలో మహిళా హక్కులు, చట్టపరమైన శిక్షలపై అవగాహన ప్రకటనలు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పిల్లలపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, మానవ అక్రమ రవాణా నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర చర్యలు చేపట్టాలని, నిర్ణయాల అమలుపై నిరంతర సమీక్ష నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, సమావేశంలో వచ్చిన ప్రతి సూచనను కార్యాచరణ ప్రణాళికగా మార్చి వేగవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీజీ చారుసిన్హా, పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌కు చెందిన సంగీతా సత్యనారాయణ, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ శాఖ కమిషనర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



