సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం

– పీఏసీఎస్‌ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్పునకు నిర్ణయం
– ఎఫ్‌పీవోలుగా ఎంపికైన పీఏసీఎస్‌లన్నీ బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు, వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సహకారం పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకోవాలని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అప్పుడే ఆర్థిక పరిపుష్టి సాధించడంతోపాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలవని అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఎన్‌సీడీసీ, కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌పీవోలతో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన రాష్ట్రంలోని ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తూ సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు వంటి సొసైటీలు మరిన్ని ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా పదివేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భంలో ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా మార్చి వాటికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌పీవోలుగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌పీవోకు రూ.2 కోట్ల వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ జిల్లా, ఇతర జిల్లాల్లో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల, రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు. రైతులకు కావాల్సిన మట్టి నమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డెయిరీ, పౌల్ట్రీ ఇలా అన్ని రంగాల్లో వాటి సేవలను విస్తరించేలా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, సంఘ సమావేశాలలో ఆయా రంగాల్లో నిష్ణాతులను ఆహ్వానించివారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సమావేశంలో ఎన్‌సీడీసీ రీజినల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, టీజీ కోఆపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌ మోహనరెడ్డి, టీజీకాబ్‌ చైర్మన్‌ రవీందర్‌ రావు, డీసీసీబీ చైర్మన్లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ చైైర్మన్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *