జిల్లా అభివృద్ధికి సహకరిస్తా

ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి హామీ

నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లా అబివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. నల్గొండ కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో ముందుగా మంత్రి వ్యవసాయ శాఖ సమీక్షలో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అంశాలపై మండలస్థాయి అధికారులతో జిల్లా అధికారి రోజూ పర్యవేక్షించాలన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తికి సహకారం అందిస్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్‌ శాఖ అధికారులు ఎమ్మెల్యేల విజ్ఞప్తుల మేరకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పక్షం రోజులకొకసారి సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి కృషిచేస్తామని, ప్రాజెక్టుల భూసేకరణపై ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి నిలపాలని కోరారు. ఎస్‌ఎల్బీసీ పనుల పునఃప్రారంభానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని తెలిపారు. డిరడి, హెచ్‌ఎల్‌సి లైనింగ్‌, నెల్లికల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, బునియాధిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామని, వీటి భూసేకరణను పూర్తి చేసే విషయంపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని కోరారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్‌అండ్‌బి ద్వారా నల్గొండ జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. రూ.45 కోట్లతో సంగెం బ్రిడ్జికి మంజూరు ఇచ్చామని, నల్గొండ-మల్లేపల్లి-దేవరకొండ రహదారులను హామ్‌ రోడ్‌ కింద మంజూరు చేశామని, రూ.1200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు హాం పథకం కింద డబుల్‌ రోడ్ల నిర్మాణానికి మంజూరు ఇచ్చామని, పంచాయతీ రోడ్లను సైతం హామ్‌ కిందకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని తెలిపారు. ఎస్డీఎఫ్‌ కింద ప్రతి ఎమ్మెల్యేకు తక్షణమే రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి టోకెన్లు రైజ్‌ చేయాలని ఎమ్మెల్యేలను కోరారు.
సమస్యలు ప్రస్తావించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
రాచకాలవ గుర్రపు డెక్కతో నిండిపోయిందని, నిర్వహణకు నిధులు లేవని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇరిగేషన్‌ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌ రెడ్డి చిత్రియాల్‌, రాములోరి బండ లిఫ్ట్‌ల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాళేశ్వరం 15వ ప్యాకేజీ 8 కి.మీ కాలువ తవ్వితే 20 చెరువులకు నీరు వస్తుందని, అందువల్ల కొత్త డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. రుణ మాఫీకి సంబంధించి ఏపీజీవీబీ బ్యాంకులో ఖాతాలున్న రైతులకు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ సమస్య వల్ల నిధులు వెనక్కి వెళ్లాయని, ఈ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బస్వాపూర్‌ పునరావాస కేంద్రానికి నిధులివ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కోరగా నిధుల విడుదలకు మంత్రి హామీ ఇచ్చారు. రాచకాలువకు ఇన్‌చార్జి ఇంజనీరింగ్‌ అధికారిని నియమించాలని, రుద్రమదేవి చెరువు 800 మీటర్లు తీస్తే చెరువు నిండుతుందని, వీటిపై దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ కోరిన మేరకు వెంటనే చర్య తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ పెండ్లిపాకల ఎత్తిపోతల గురించి మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లేముల భూసేకరణకు నిధులు మంజూరు చేయాలని, ఐటిపాముల భూసేకరణ పూర్తి చేయాలని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలకు శంకుస్థాపన చేయాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం విజ్ఞప్తి చేశారు. మునుగోడు పరిధిలోని శివన్నగూడెం, ఇతర ప్రాజెక్టులను పూర్తిచేయాలని, రెండో విడత ఎక్కువమందికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఇదివరకే బేస్‌మెంట్‌ నిర్మించుకున్న వారికి సడలింపు ఇవ్వాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *