– పిఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణలో కేంద్రంతో సమన్వయం
– ప్రభుత్వ చర్యలతో సులభతరమైన గ్యాస్ సరఫరా
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పెట్రోలియం ఉత్పత్తులతోపాటు ఎల్‌పిజి గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వీటి సరఫరా గురించి వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు వంట గ్యాస్ సరఫరాపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖల మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, హార్డిప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషీలు శనివారం ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రం నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రితోపాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఇరాన్-అమెరికాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణంతో పెట్రోలియం ఉత్పత్తులతో పాటు గృహ వినియోగ గ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు పెరిగాయని చెప్పారు. ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరగడంతో తాత్కాలికంగా కొంతమేర ఇబ్బంది ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకీ దిగి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో సమర్థవంతంగా ఒత్తిడిని నియంత్రించగలిగామన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, డిమాండ్‌కు తగిన రీతిలో సరఫరా కొనసాగుతోందని, తాను స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు పంపిణీ దారులతో సమీక్షలు నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. అదే సమయంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పిజి కొరతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు వాణిజ్య సిలిండర్ల కేటాయింపులను పెంచాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు. కేంద్రం కేటాయింపులను పెంచగలిగితే వాణిజ్య అవసరాలకు సరిపడ గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. అలాంటి వారిపై నిఘా పెంచి కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరా నెట్‌వర్క్(పీఎన్‌జీ) విస్తరణలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు పోతామన్నారు. హైదరాబాద్‌లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సిఎన్‌జి సరఫరాను విస్తరిస్తున్నామని, జంట నగరాలలో ఆటోలు, ట్యాక్సీలతోపాటు ప్రైవేటు వాహనాలకు సిఎన్‌జీ సరఫరా కోసం ఫిల్లింగ్ కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





