– ఉత్తమ్, రేవంత్ మాటలకు పోలికేది
– చెరో మాట మాట్లాడుతుంటే ఎలా
– ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు స్పందించరు
– కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24: కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారని బీఆర్ ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో పూటకో మాట, ఘడియకో లెక్క ఉందన్నారు. 299 టీఎంసీ కృష్ణా జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో వారు ద్రోహులు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్‌ఎస్.. డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్ అన్నారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఒకవైపు చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం వహించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆలమట్టి ఎత్తుపై మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా అన్నారు.కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి దద్దమ్మలు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు ఉత్తం చెప్పుకున్నడు అని హరీష్ రావు గుర్తు చేశారు. వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? కనీస అవగాహన లేకుండా ఎట్ల మాట్లాడుతున్నరు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారని హరీష్ రావు నిలదీశారు. కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం చేసారు. ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిసారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించారు. 763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం. ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు డబ్బా కొడుతున్నడు ఉత్తమ్ అని అన్నారు. రాష్ట్రం మీద ప్రేమ లేదు.. నీటి ప్రయోజనాల మీద పట్టు లేదు. ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. 299:512 హక్కుల విషయంలో మేం సంతకం పెట్టినం అని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేస్తవా ఉత్తం అని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటాకు పరిమితం అయ్యింది. అడ్ హక్‌కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞానులు రేవంత్ రెడ్డి, ఉత్తంలు. 2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో స్పష్టంగా ఉంది. ముద్దుల అడ్వైజర్ ఆదిత్యానాథ్ కూడా సంతకం పెట్టిండు. ఆయనే ఇప్పుడు అడ్వైజర్. కానీ ఉత్తం ఏమంటడు, బిఆర్‌ఎస్ పెట్టింది అంటడు. జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరామని హరీష్ రావు గుర్తు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌తో కేవలం 50ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ఉత్తం కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది, దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టీఎంసీ ల సామర్థంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ నిర్మించిండు. 83 టర్లకు డీపీఆర్ పంపినం. అన్ని డైరెక్టరేట్ల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించినం. బ్యారేజీ కట్టినం. నీటిని కూడా లిప్టు చేసుకుంటున్నం. కాంగ్రెస్ వచ్చాక ఓ అండ్ ఎం డబ్బులు ఇవ్వక దేవాదులకు నీళ్లు లిప్టు చేయకపోతే, బిఆర్‌ఎస్ నిలదీసింది కూడా. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక్క ఎన్‌వోసీ మినహా అన్ని అనుమతులు బిఆర్‌ఎస్ హయాంలోనే వచ్చాయి. ప్రాజెక్టులకు అనుమతులు ఆపడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ సమ్మక్క సాగర్ విషయంలోనూ అదే చేసింది. 2023 ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్‌వోసీ రాకుండా చేసారు అని హరీశ్‌రావు తెలిపారు. నీళ్ల దోపిడిని అడ్డుకోకపోతే రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదన్నారు. ఇప్పుడు అక్కడున్న బిజేపీ ప్రభుత్వంతో దోస్తీ కట్టి 50 ఎకరాలకు ఎన్‌వోసీ తెచ్చి మొత్తం ప్రాజెక్టునే కట్టినట్లు బిల్డప్ ఇస్తున్నరు. 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కష్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి.
ఆల్మట్టి ఎత్తు పెంపుపై మౌనం ఎందుకు ?
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి, బిహార్‌కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నడు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర ఇది. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.
———————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే