కొనసాగిన ఇజ్రాయెల్‌ ‌దాడులు

– బాంబు దాడిలో ధ్వంసమైన గాంధీ హాస్పిటల్‌
– పాఠశాల పై దాడిలో 165‌కు చేరుకున్న మృతుల సంఖ్య‌

టెహ్రాన్‌,‌ మార్చి 2:అమెరికా-ఇయెల్‌ ‌సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ ‌రోరింగ్‌ ‌లయన్‌’ ‌లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న గాంధీ హాస్పిటల్‌ ‌పై ఇజ్రాయెల్‌ ‌వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో భవనం చాలా వరకు దెబ్బతింది. బాంబుల తాకిడికి కిటికీలు పగిలిపోయి, వార్డుల నిండా శిథిలాలు పేరుకుపోయాయి. దట్టమైన పొగలు వెలువడటంతో హాస్పిటల్‌ ‌లో ఉన్న రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ ‌రాజధాని టెహ్రాన్‌ ‌యుద్ధ జ్వాలలతో అట్టుడుకుతోంది. ఓ వైపు బాంబు దాడులు జరుగుతున్నా నర్సులు తమ ప్రాణాలకు తెగించి ఇన్సులేటర్లలో ఉన్న నవజాత శిశువులను, ఐసీయూలోని చిన్నపిల్లలను చేతులతో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ  డైరెక్టర్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ ‌స్పందించారు. ఆసుపత్రులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇదిలావుంటే ఇరాన్‌లోని మినాబ్‌ ‌ప్రావిన్స్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలపై ఇజ్రాయిల్‌ ‌దాడిలో మరణించిన వారి సంఖ్య 165కి పెరిగిందని ఇరాన్ ‌మీడియా నివేదించింది. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్‌ ‌ప్రావిన్స్‌లోని మినాబ్‌లోని షాజారే తయ్యిబె బాలికల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ దాడి జరిగింది. 96 మంది గాయపడ్డారని ఐఆర్‌ఎన్‌ఏ ‌వార్తా సంస్థ నివేదించింది. దాడి జరిగిన ప్రదేశంలో శోధన, రక్షణ చర్యలు ముగిశాయని మినాబ్‌ ‌కౌంటీ గవర్నర్‌ ‌తెలిపారు. బాలికల పాఠశాలపై దాడి వార్తలను ఇజ్రాయిల్‌ ‌ఖండించింది. నివేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చి ట్విట్టర్‌లో దాడికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. ఇజ్రాయిల్‌, అమెరికా శనివారం ఇరాన్‌పై ఉమ్మడి దాడిని ప్రారంభించాయి. ఈ దాడిలో ఇరాన్‌ ‌సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరియు ఇతర సీనియర్‌ ‌సైనిక అధికారులు మరణించారు.

లెబనాన్‌ ‌రాజధాని బీరూట్‌పై ఇజ్రాల్‌ ‌దాడి
బీరూట్‌,‌ మార్చి 2: లెబనాన్‌ ‌రాజధాని బీరూట్‌పై ఇజ్రాయిల్‌ ‌దాడి చేసింది. లెబనాన్‌లోని దాదాపు 50 గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్‌ ‌సైన్యం కోరింది. ఆ తర్వాత ఇరాన్‌ ‌గల్ఫ్ ‌దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకారం తీర్చుకుంది. బహ్రెయిన్‌, ‌జోర్డాన్‌, ‌కువైట్‌, ‌ఖతార్‌, ‌సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ఇరాన్‌ ‌క్షిపణి మరియు డ్రోన్‌ ‌దాడులను తీవ్రంగా ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్‌ ‌సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ హత్య, పునరావృత ఇజ్రాయిల్‌ ‌దురాక్రమణలకు ప్రతీకారంగా లెబనాన్‌ ‌మిలిటెంట్‌ ‌సంస్థ హిజ్బుల్లా సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ ‌సరిహద్దు దాటి క్షిపణులు ప్రయోగించింది. ఈ మేరకు హెజ్బుల్లా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఒక సంవత్సరానికి పైగా కాలం తర్వాత హెజ్బుల్లా ఇజ్రాయిల్‌పై దాడి చేసినట్లు ప్రకటించుకోవడం ఇదే తొలిసారి. ఈ దాడిలో ఒక క్షిప‌ణిని అడ్డుకున్నామని, మరికొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడ్డాయని ఇజ్రాయిల్‌ ‌రక్షణ దళాలు తెలిపాయి. ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్‌, ‌లెబనాన్‌ ‌మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇజ్రాయిల్‌ ‌మరియు హెజ్బుల్లా మధ్య ఏడాదికిపైగా కొనసాగిన ఘర్షణలకు ముగింపు పలికింది. ఆ సమయంలో ఇజ్రాయిల్‌ ‌దాడులు హెజ్బుల్లాను గణనీయంగా బలహీనపరిచినట్లు విశ్లేషకులు భావించారు. అయితే, అప్పటి నుంచి ఒప్పంద ఉల్లంఘనలపై ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, బీరూట్‌ ‌దక్షిణ శివార్లలో వేలాది హెజ్బుల్లా మద్దతుదారులు ఇరాన్‌ ‌సుప్రీం నాయకుడికి నివాళులర్పించారు.

ఇజ్రాయిల్‌ ‌దాడుల్లో 550 మంది మృతి : ఇరాన్‌ వెల్లడి

టెహ్రాన్‌: అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌విరుచుకుపడుతోంది. క్షిపణి స్థావరాలను టార్గెట్‌ ‌చేసుకుంటూ, యుద్ధనౌకలను ధ్వంసం చేస్తోంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌, ‌గల్ఫ్ ‌దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ ‌దాడులు చేస్తోంది. కాగా, గత శనివారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకూ తమ దేశంలో ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌, ఇతర సీనియర్‌ అధికారులతో సహా 550 మందికి పైగా మరణించినట్టు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ ‌ఖమేని ‌మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ మిలటరీ కమాండర్లు ప్రకటించారు. యూఏఈ సహా గల్ఫ్ ‌దేశాలపై దాడులు తీవ్రతరం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తాజా పరిస్థితి యావత్‌ ‌మధ్యప్రాచ్యాన్ని యుద్ధం వైపు నడిపే అవకాశాలున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌ ఎయిర్‌ ‌పోర్ట్, ‌బుర్జ్ ‌ఖలిఫా, బహ్మాన్‌, ‌కువైట్‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్‌ ‌టార్గెట్‌ ‌చేస్తోంది. మరోపైపు, ఇరాన్‌ ‌రివల్యూషనరీ గార్డ్ ‌కార్పస్ (ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయానికి ధ్వంసం చేసినట్టు అమెరికా మిలటరీ ప్రకటించింది. కాగా, యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌షాకింగ్‌ ‌ప్రకటన చేశారు. ’ఆపరేషన్‌ ఎపిక్‌ ‌క్యూరీ’లో భాగంగా ’ఒకే షాట్‌’‌లో 48 మంది ఇరానియన్‌ ‌టాప్‌ ‌లీడర్లను మట్టుపెట్టామని తెలిపారు. తొమ్మిది యుద్ధ నౌకలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇరాన్‌ ‌నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశామని, ఈ చర్యలో కనీసం ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు. యుద్ధం మరో 4-5 వారాలు పట్టవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *