– క్విట్ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాల్సిందే
– గాంధీ భవనలో ‘క్వింట్ ఇండియా’లో పీసీసీ చీఫ్ మహేష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాజ్యాంగాన్ని(constitution) మార్చాలని బీజేపీ ప్రభుత్వం(BJP Govt.) కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief MaheshKumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చర్యలన్నీ ఈ కోవలో భాగంగానే సాగుతున్నాయన్నారు. గాంధీ భవన్‌లో క్విట్ ఇండియా డేను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. క్విట్ బిజెపి నినాదంతోనే దేశానికి రక్ష అన్నారు. ఎలక్షన్ కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ప్రదర్శించారు. కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం ఏవిధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని సూచించారు. 1942లో బ్రిటీష్ పాలకులను తరిమికొట్టాలని అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైనదని ఉద్ఘాటించారు. డూ ఆర్ డై నినాదంతో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారని కొనియాడారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలను చరిత్రలో లేకుండా చేద్దామని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. స్వతంత్ర సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై మోదీ ప్రభుత్వం కుట్ర పూరిత దాడి చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్, బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌గా మారిందని ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. కులాలు, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరంటే ఒక్కరూ కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు లేరని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దేశ స్వాతంత్య కోసం ఉద్యమించిదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే