నియోజవర్గాలు పెంచాలన్న పిటిషన్‌ డిస్మిస్‌

–  సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

న్యూదిల్లీ, జులై 25: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీ, తెలంగాణ లను మినహాయించి కొత్తగా ఏర్పాటైన జమ్ము కాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజన చేయడం అసమంజసమన్న పిటిషనర్‌ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్‌ 170(3) ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశముందని పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్రం నిబంధనల ప్రకారమేనని వివరించింది. జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో జరిగిన పునర్విభజనను తెలుగు రాష్ట్రాలతో పోల్చడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణలను పునర్విభజన నోటిఫికేషన్‌ నుండి మినహాయించడంలో కేంద్రానికి ప్రత్యేక ఉద్దేశం లేదని, ఇందులో రాజ్యాంగ విరుద్ధత లేదని సుప్రీంకోర్టు తేల్చింది. కాగా, ఈ తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఆశపై నీళ్లు చల్లినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *