– పెయిడ్ ఆర్టికిల్స్ రాస్తే భయపడను
-కేసీఆర్ మాత్రమే మా నాయకుడు
– కావాలనే నిజామాబాద్‌లో ఓడించారు
– నేనసలే మంచిదాన్ని కాదు
– నా జోలికొస్తే తీపిగా వుండదు
– పదవులు ఆశించేదాన్ని కాదు
– కె.టి.ఆర్.పై నిప్పులు చెరిగిన కవిత
కెసిఆర్ కుటుంబ రాజకీయం ముదురు పాకాన పడింది. ఇంట్లో మొదలైన రాజకీయ వాయుగుండం, పెను తుఫాన్‌గా మారింది. తీరం ఎక్కడ దాటుతుందో తెలియదు కానీ, ప్రస్తుతం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఐక్యత గాలిబుడగని తేలిపోయింది. కెసిఆర్ నాయకత్వాన్ని కెటిఆర్ హైజాక్ చేసి గుప్పిట్లో పెట్టుకున్న తీరుపై అసంతృప్తికి లోనైన కవిత లేఖ పేరుతో బాంబు పేల్చారు. కెసిఆర్ నాయకత్వం తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని సోదరుడు కెటిఆర్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీని ఇష్టారీతిన నడుపుతూ బిజెపికి గొడుగు కిందకు చేరుస్తు న్నారంటూ మండిపడ్డారు. వందిమాగధులతో విమర్శలు చేయిస్తే వూరుకునేది లేదని ఘాటు హెచ్చరికలు చేశారు. తనను సవాలు చేయాలనకుంటే వుఫ్ మని వూదేస్తానని హెచ్చరించారు. ట్విట్టర్ రాజకీయాలను సహించేది లేదని తేల్చారు.
మొత్తంగా అన్న కెటిఆర్‌పై కవిత యుద్ధం ప్రకటించినట్టు స్పష్టమైంది. పట్టుతప్పుతున్న పార్టీని కాపాడుకోవడమే తన లక్ష్యమని గురువారం కవిత డియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తేల్చిచెప్పారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పని చేస్తున్నవారు తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైందన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అని పరోక్షంగా కెటిఆర్‌పై మండిపడ్డారు. పార్టీ సోషల్ డియాలో తనను టార్గెట్ చేశారని, తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లీకు వీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారని మండిపడ్డారు. తన జోలికి వస్తే బాగుండదని అంటూనే తానసలే మంచిదానిని కాదన్నారు. కేసీఆర్‌ను తామే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నవారు అంతటి పెద్దవాళ్లేమీ కాదన్నారు.
తనపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు వొస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, మరో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు. తాను వాళ్లలా చిల్లర రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటానని పేర్కొన్నారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున చేస్తున్నానని, కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించబోనని నిర్మొహమాటంగా చెప్పారు. నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి? అయినా నీకు నొప్పి ఏందిరాబయ్? అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తన అన్న కెటిఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదన్నారు.
దమ్ముంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనటం కరెక్టేనా అని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. తనకు, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందన్నారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసునని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కూడా కవిత ఆరోపించారు.
పార్టీని బీజేపీలో కలపాలని చూస్తున్నారు. బీజేపీలో విలీనం చేయొద్దని తాను జైల్లో వున్నప్పుడే స్పష్టంగా చెప్పానన్నారు. కానీ విలీన ప్రయత్నాలు మానలేదన్నారు. తాను వుంటే బీజేపీలో కలపడం కుదరదని.. అందుకే తనను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తనపై, తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న కుట్రలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్న కొందరు కోవర్టులు తనను ఓడించేందుకు ప్రయత్నించారని, పెయిడ్ న్యూస్‌లు వేసి, లేఖల్ని లీక్ చేసి, బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ను కలిపే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలంటే ట్వీట్లు- చేయడం మాత్రమే కాదు, కార్యాచరణ చూపించాలి. పార్టీ నడిపించే సత్తా లేదని నన్ను తప్పుబడుతున్నవారు ముందుగా వాళ్లు ఏం చేశారో చెప్పాలని అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.తమపై కుట్రలు జరుగుతున్నాయని, తనను బీఆర్‌ఎస్ నుంచి బయటకు నెట్టాలని ప్రయత్నాలు జరుగు తున్నాయని కవిత ఆరోపించారు. నాకు ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నాడు. ఆయన కేసీఆర్. కొత్త పార్టీలు ఎందుకు? ఉన్న బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను కాపాడితే చాలు. తెలంగాణ జాగృతి ద్వారా నేను పార్టీకి, రాష్ట్రానికి సేవ చేస్తున్నాఅని స్పష్టం చేశారు. తాను పదవులు పదవులు అడగలేదు. కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో పని చేస్తున్నా.
నా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసం పోరాడిన నేను.మామూలు నాయకురాలిని కాదన్నారు. తనతో పెట్టుకుంటే తీపిగా ఉండదని ఇప్పటికైనా గ్రహించాలి,అంటూ కవిత మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా దెప్పిపొడిచారు. తన లేఖ లీక్ చేసిందెవరు తేల్చమంటే తనపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్ లెక్క తాను చాలా తిక్కదానినని ఆమె పునరుద్ఘాటించారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు రావని సూటిగా మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టారు. సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతానన్నారు. మావాళ్ళు కొందరు సోషల్ డియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
వరంగల్ సభ తమ వల్లనే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ను మోసేంత పెద్ద వాళ్ళు అయిపోయామని వారంతా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా ఉండగా చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా కేంద్రం అడ్డుకోవటం లేదని ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికీ గోదావరి నదీ జలాలు పంపకం సరిగా జరగలేదన్నారు. ఏపీ చేపట్టనున్న బనకచర్ల ప్రాజక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్ప ఇతర నేతల నాయకత్వంలో తాను పనిచేయనని కుండ బద్దలు కొట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వారిని గౌరవిస్తానని ఆమె పేర్కొనడం కొసమెరుపు.





