కాంగ్రెస్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సహించం

– పారిశ్రామిక‌ భూములు వెనక్కి తీసుకుంటామంటే ఊరుకోం
– ఎకరం రూ.170 కోట్లకు అమ్మినం అంటూ వార్తలు రాయించుకుంటోంది
– మరోపక్క అదే ప్రభుత్వం ఎకరం రూ.కోటికి అమ్మ‌డ‌మేమిటి?
– ‘హిల్ట్‌’పై ప్రజలకు వివరించేందుకే పారిశ్రామికవాడల్లో పర్యటనలు
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మండిపాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ఉద్యోగ ఉపాధి కల్పన కోసం గత ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం హిల్ట్‌ పాలసీ పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. నగరంలో ఇండ్లకు, పాఠశాలలకు, హాస్పిటల్స్‌కు చివరికి శ్మశానాలకు స్థలం లేదు కానీ 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు అపార్టుమెంట్లు, విల్లాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల కోసం ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటున్నదని, వాటిపై ఆధారపడిన లక్షల మంది పొట్ట కొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. నగరంలో స్థలం లేదని ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్‌ కట్టలేదంటూ ఈ భూములను వెనక్కి తీసుకొని అక్కడ ఇందిరమ్మ ఇండ్లు, యంగ్‌ ఇండియా స్కూల్స్‌, హాస్పిటల్స్‌ కట్టాలనేది దాని అలోచన చేస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న రూ.5 లక్షల కోట్ల కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈరోజు పారిశ్రామికవాడల్లో పర్యటిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అంశాన్ని తమ పార్టీ వదిలిపెట్టదని అన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, నగరంలోని కాలనీల్లో తిరిగి ప్రజలకు వివరిస్తామని, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తామని, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు పోతామని చెప్పారు. ప్రజల భూమిని కాపాడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. రేవంత్‌ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే అటు పారిశ్రామిక భూములతోపాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ దోపిడీపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమాచారం లీక్‌ అయిందంటూ ప్రభుత్వం బాధపడుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

ఈరోజు తాము జీడిమెట్లలో పర్యటిస్తున్నామని, ఇక్కడ మార్కెట్‌ ధర కనీసంగా రూ.లక్ష ఉంటే ప్రభుత్వం కేవలం రూ.4000కే ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడతామని చెప్తున్నదని అన్నారు. ఒకపక్క ఎకరం రూ.170 కోట్ల చొప్పున భూములు అమ్మినం అంటూ రోజూ వార్తలు రాయింకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఎకరం కేవలం రూ.కోటి చొప్పున జీడిమెట్లలో భూమి ఎలా అమ్ముతుందని కేటీఆర్‌ నిలదీశారు. తాము గతంలో తెచ్చిన గ్రిడ్‌ పాలసీ ద్వారా ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మించేందుకు అవకాశం ఉండె. అవి ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ పాలసీ ఆదర్శం అయితే ఈ పారిశ్రామిక భూముల్లో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలని, ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. నగరం నుంచి కాలుష్యకారక పరిశ్రమలను బయటకు పంపాలన్నది అందరి ఉద్దేశం.. అందుకే ఎలాంటి కాలుష్యం లేని అంతర్జాతీయస్థాయి ఫార్మా సిటీని ఏర్పాటు చేశాం.. దాన్ని కూడా రేవంత్‌ రెడ్డి ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వాడుకుంటున్నాడు.. ఆయనకు తెలిసింది రియల్‌ ఎస్టేట్‌ దందా మాత్రమే.. అందుకే ఫార్మా సిటీలో, ఇక్కడ పారిశ్రామిక భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని కేటీఆర్‌ ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *