ఓటెత్తిన స్తంభాద్రి

– ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో పోలింగ్
– కాంగ్రెస్ X సీపీఐ బిగ్ ఫైట్
– పోలింగ్ సరళి అంచనా వేస్తున్న నేతలు
– ఉత్కంఠగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పోలింగ్

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : స్వల్ప సంఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా పరిధిలో 5 మున్సిపాలిటీలు, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాల్టీలకు పోలింగ్ జరిగింది. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల (ఐడిఓసి)లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సీపీఐ హోరాహోరీగా తలపడ్డాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆసక్తి రేపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాల్టీల పోలింగ్ సరళి, ఫలితాలు తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు.

ఖమ్మం జిల్లా

ఎదులాపురం మున్సిపాలిటీలో 32వార్డులకు గాను 69 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 37,391 ఓట్లు పోల్ అవ్వగా 85.35 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. 31, 32 వార్డుల్లో సీపీఐ, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. సీపీఎం నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని సీపీఐ ఆరోపించింది. 26వ పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్, బీఆరఎస్ బాహాబాహీకి దిగాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు కూడా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని బీఆరఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 72మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 40 పోలింగ్ కేంద్రాల్లో 18,866 మంది ఓటర్లను కేటాయించారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 41 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 20,639 ఓట్లు పోల్ కాగా 83.60 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ఐదో వార్డు పోలింగ్ కేంద్రంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ ఓటు వేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా 48 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 22,326 ఓట్లు పోల్ అయ్యాయి. 77.44 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా 44 పోలింగ్ కేంద్రాల్లో 20,100 ఓట్లు పోల్ అయ్యాయని, 78.27 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. 9వ వార్డు ఇందిరా డెయిరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 వార్డులు ఉండగా 201 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 999,92 ఓట్లు పోల్ కాగా 74.19 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. 48వ డివిజన్ జగ్గు తండ ఎంపీపీఎస్‌లోని పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా 35 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 12,839 ఓట్లు పోల్ అయ్యాయని, 76.20 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24వార్డులు ఉండగా 52 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 23,079 ఓట్లు పోల్ అయ్యాయని, 68.44 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *