మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం కాంగ్రెస్‌దే

– మంత్రి శ్రీధర్ బాబు

వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు, నాయకులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపిలు చీకటి మిత్రులు అని పేర్కొన్నారు. వికారాబాద్ ప్రాంతానికి ఉన్న భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి దీనిని రాష్ట్రంలోనే ప్రముఖ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకోసం వందల కోట్ల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని, పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకొని పట్టణ ప్రాంతాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలే పార్టీకి శ్రీరామరక్ష అని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే పేద, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామ‌న్నారు. టిఆర్ఎస్, బిజెపిలను ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని, ప్లాట్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారికి సొంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, జీరో వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *