పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం

– ఎవ‌రు స‌ర్పంచ్‌గా గెలిచినా న్యాయం చేస్తాం
– అన్ని గ్రామాల‌ను స‌మానంగా అభివృద్ధి చేస్తాం
– విజ‌న్ డాక్యుమెంట్‌తో రూ.5.75ల‌క్ష‌ల కోట్ల‌ పెట్టుబ‌డులు
– 2047 నాటికి 1.39ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుదుత్ప‌త్తికి ప్ర‌ణాళిక‌లు
– స‌ర్పంచ్‌ల అభినంద‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: పంచాయ‌తీ ఎన్నికల్లో ఇప్పటికే 85 శాతం స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింద‌ని, ఇందిరమ్మ ప్రజా పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున దీవించి కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను పెద్ద ఎత్తున గెలిపిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో  సర్పంచుల అభినందన సభలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్ బ‌ల‌ప‌ర‌చిన‌ అభ్య‌ర్థులు అత్య‌ధిక‌ స్థానాలు గెలుచుకొని విజయ దుందుభి మోగించి చరిత్ర సృష్టించారని, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్నాయని తెలిపారు. ఫలితాలు హర్షించదగిన రీతిలో వెల్లడయ్యాయన్నారు. ఎవరు సర్పంచులుగా గెలిచినా ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఈ విజయ దుందుభిలో కార్యకర్తల కృషి అద్భుతమైనదన్నారు. దేశంలోనే అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందని, అభివృద్ధి చెందిన గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా తెలంగాణతో పోటీపడే పరిస్థితి లేదన్నారు. ఎక్కడ నదులకు ఆనకట్టలు కట్టాలి, ఏ ప్రాంతంలో రోడ్లు వేయాలి, ఏ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్లు నడపాలి, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఫార్మా, ఐటీ పార్కులు ఎక్కడ నెలకొల్పాలనేది విజన్ డాక్యుమెంట్ 2047లో వివరించామని డిప్యూటీ సీఎం తెలిపారు. 2017 కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించబోతున్నాం, అందులో భాగంగా 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం, ఎలా అందించబోతున్నామో ఈజన్ డాక్యుమెంట్లో వివరించామని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి రానున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర నియోజకవర్గంలో 131 సర్పంచ్ స్థానాలకు 90 స్థానాలకుపైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని రికార్డు సృష్టించారని,  1983 నుంచి చూస్తే ఈ స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నడు కూడా ఇంత పెద్ద మొత్తంలో సర్పంచ్ స్థానాలు గెల్చుకోలేదని, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి సర్పంచ్ కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తే నాయకుడు కాలేడ‌న్నారు. ఈరోజు నుంచే సర్పంచుల బాధ్యత మొదలైందని, కేవలం వ్యవసాయమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విద్య, వైద్య రంగాలపై సర్పంచులు దృష్టి సారించాలని, నిత్యం సమీక్షించాలని తెలిపారు. పిల్లలు ఎంత బాగా చదువుకొని పైకి వస్తే వారు ఊరు గురించి అంత బాగా ఆలోచిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సర్పంచులు పాఠశాలలను సందర్శించాలి అక్కడ బోధన ఎలా జరుగుతుంది వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో సమీక్షించి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్య, వైద్య రంగాల అంశాలపై 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు లేదా తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని డిప్యూటీ సీఎం తెలిపారు. అంతరాలు లేని సమసమాజం సృష్టించడం, ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ప్రజా ప్రభుత్వం ఎజెండా అని భట్టి విక్రమార్క అన్నారు.

——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *