– జూబ్లీహిల్స్ ఫలితమే నిదర్శనం
– స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
– మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మిర్యాలగూడ,ప్రజాతంత్ర,నవంబర్17: మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వద్ద రింగురోడ్డు పనులకు మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక పార్టీకి డిపాజిట్ గల్లంతైందని.. మరో పార్టీ కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారి ద్వారా అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రూ.180.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రులు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్డును, డబుల్ రోడ్డుగా చేస్తామని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మిర్యాలగూడ కేఎన్‌ఎం డిగ్రీ కాలేజీని.. ప్రభుత్వ కాలేజీగా మార్చింది తామేనని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యకర్తల కృషి కారణమన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర చెల్లించడంతోపాటు 48 నుంచి 72 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఉత్తమ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





