యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

– కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గం
– జీహెచ్ఎంసీ విభ‌జ‌న అశాస్త్రీయం
– ఎన్నిక‌ల వేళ అధికారుల‌ బ‌దిలీలు క‌రెక్టు కాదు
– మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లతో మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, తనతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారన్నారు. బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమన్నారు. ఇది మక్తల్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అనుసరించిందన్నారు. పోలీసుల సమక్షంలోనే బహిరంగంగా, పోలింగ్ బూత్‌ల లోపల విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసిందని ఆరోపించారు. దీనిపై తాము పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేదా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత, బీఆరఎస్‌పై ఆదరణ లేకపోవడం స్పష్టంగా కనిపించడంతో చివరికి డబ్బు, దౌర్జన్యాల ఆధారంగా ఎన్నికలను ప్రభావితం చేయాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నించాయని ఆరోపించారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించబోతోందన్నారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనేకమంది ఐఏఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులను బదిలీ చేసిందన్నారు.

జీహెచ్‌ఎంసీ విభజన విధివిధానాల ఉల్లంఘనే

గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం కూడా ఎన్నికల కమిషన్ విధివిధానాలను ఉల్లంఘించిన చర్యేనని కిషన్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్లలో కలిపారని, దీని వల్ల ఆ గ్రామాల పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం పేదలకు ఉపయోగపడుతుండగా ఈ విభజనతో వారు పలు సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా అనేక గ్రామాలను కొత్త కార్పొరేషన్లలో చేర్చిందని, 2007లో ఏర్పడిన జీహెచఎంసీ విస్తీర్ణం 650 చ.కి.మీ. కాగా ఇప్పుడు మూడు కార్పొరేషన్లు కలిపి 2053 చ.కి.మీ.కు పెంచారని, కానీ ఈ విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక లేదని విమర్శించారు. ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. సెన్సస్‌కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్, నల్లగొండ, హైదరాబాద్ కార్పొరేషన్లను విభజించిందన్నారు. ఇది పూర్తిగా చట్టవ్యతిరేక నిర్ణయమన్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి పేర్లతో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 300 వార్డులు, 60 సర్కిళ్లతో నగర పాలన పునర్వ్యవస్థీకరణ చేశారని ఆయన తెలిపారు. డిసెంబరు 31, 2025 తర్వాత ఎలాంటి మార్పులు చేయరాదని, అవసరమైతే మే 2027 వరకు వేచి చూడాలని సెన్సస్ డైరెక్టరేట్ స్పష్టంగా పేర్కొందన్నారు. ఓఆర్‌ఆర్‌ను సరిహద్దుగా తీసుకుంటామని చెప్పినా కొన్ని ప్రాంతాలు ఓఆరఆర్ బయట, మరికొన్ని లోపల ఉంచారన్నారు. ఎయిర్‌పోర్టు, బీహెచఈఎల్, ఇక్రిశాట్ వంటి కీలక ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి ప్రభుత్వం మినహాయించిందని, మజ్లిస్ ఒత్తిడి మేరకు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి ప్రాంతాల్లోని మజ్లిస్ ఆధిపత్యం కలిగిన ప్రాంతాలను కోర్ జీహెచఎంసీలో చేర్చారని తెలిపారు. ఇప్పటికే కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్న పరిస్థితిలో ఇది మరింత భారమవుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి జీహెచఎంసీ పరిధి నుంచే సుమారు 70 శాతం ఆదాయం వస్తున్నప్పటికీ జీహెచఎంసీ, వాటర్ వర్క్స్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు ఆర్-ఆర్ ట్యాక్స్ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్పొరేటర్లు పాడైపోయిన వీధి దీపాల కోసం జీహెచఎంసీని అడిగితే ఒక్కో కార్పొరేటర్‌కు వేలాది బల్బులు అవసరం కాగా.. కేవలం 50 లైట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. మరోవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది.. తాము కూడా మూసీ శుద్ధి కోరుకుంటున్నాం.. కానీ మున్సిపాలిటీల్లో సరైన వసతులే లేవు.. 50 శాతం సిబ్బంది కొరత ఉండగా శానిటేషన్ తూతూమంత్రంగా జరుగుతోందన్నారు. ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి.సుభాష్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, పార్టీ సీనియర్ నాయకులు జి.వెంకట్ రెడ్డి, సునీత, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *