– స‌మ‌యం దాటిపోయినా ఎమ్మెల్యే ప్ర‌చారం చేశారు
– ఇది ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కాదా?
– మ‌హిళ‌పై ఎమ్మెల్యే గ‌న్‌మన్ దౌర్జ‌న్యం
– అన్యాయాన్ని ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల అరెస్ట్
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు
– అరెస్ట‌యిన 13మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌

సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21:  ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక, పోలీసు లాఠీలతో, అక్రమ కేసులతో నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది. దానికి నిదర్శనమే ఈ 13 మంది కార్యకర్తల అక్రమ అరెస్టని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆరోపించారు. అరెస్టై సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయ‌న శ‌నివారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక వార్డులు వచ్చాయి. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు, ప్రచార గడువు ముగిసిన తర్వాత నాలుగు కార్ల కాన్వాయ్‌తో వార్డుల్లో ఎందుకు తిరిగారు? ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదా? రాత్రిపూట ఎమ్మెల్యే గన్‌మన్ దౌర్జన్యంగా ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి, బట్టలు చింపే ప్రయత్నం చేసి దాడి చేశాడు. ఆ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనం. కనీసం మెడికల్ రిపోర్ట్ లేకుండా 307 కేసు ఎలా నమోదు చేస్తారు? పోలీసులు గుడ్డిగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. అర్ధరాత్రి కాన్వాయ్‌తో తిరిగిన ఎమ్మెల్యే వాహనాలను ఎందుకు సీజ్ చేయలేదు? అక్కడే ఉన్న డీఎస్పీ డబ్బులు పంచుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? ఘర్షణ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కారు ఎక్కించిన వారిపై, ఆటోపై పెట్రోల్ పోసిన వారిపై ఆధారాలుగా వీడియోలు ఇచ్చినా, పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలు కూర్చున్నా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? డీజీపీ శివధర్ రెడ్డి సమాధానం చెప్పాల‌న్నారు. బీఆర్ఎస్ కార్యకర్తకు చెందిన టిప్పర్ లారీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ‘ఖాకీ బుక్’ అందరికీ సమానమే అని గొప్పలు చెబుతున్న డీజీపీ ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ఆ బుక్ కాంగ్రెస్ కి చుట్టంగా మారిపోయిందా? పోలీసుల కాలర్ పట్టుకుని తన్నమన్న బీజేపీ నాయకుడిపై, బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడిపై అరెస్టులు లేవు. కానీ ప్రశ్నిస్తే మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలపై కేతనపల్లి, ఆమనగల్ తదితర ప్రాంతాల్లో కేసులు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్‌ను, అధికారుల ముందే చంపేస్తానని బెదిరించిన మెదక్ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. కేతనపల్లిలో కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచడం, జనగామలో దళిత మహిళపై దాడి చేయడం ఎలక్షన్ కమిషన్‌కు కనిపించడం లేదా? కోరం లేకపోయినా ఎన్నిక వాయిదా వేయడం సిగ్గుచేటు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సుమారు 800 కౌన్సిలర్ స్థానాలను, నేరుగా 20 చైర్మన్ పోస్టులను గెలుచుకుంది. అధికార బలాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని మాత్రమే కాంగ్రెస్ కొన్ని స్థానాలను దక్కించుకుంది. ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉందనడానికి ఇదే నిదర్శనం. ఎన్నికల కోడ్ పేరుతో ఆపిన రైతుబంధును వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాలను ముట్టడిస్తాం అని హెచ్చ‌రించారు. అక్రమ కేసులు, కాంగ్రెస్ గుండాయిజంపై అసెంబ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.