అవకాశాలను అందిపుచ్చుకుని సాగాలి

– ఎదిగేందుకు డీసీసీ అధ్యక్ష పదవి తొలిమెట్టు
– కాంగ్రెస్‌లో కష్టపడితేనే పదవులు వరిస్తాయి
– ఎవరికైనా మెరిట్‌ ‌లిస్ట్ ‌ప్రకారమే అవకాశం
– భిన్నాభిప్రాయాలు పార్టీ కార్యక్తల స్థయిర్యాన్ని దెబ్బతీస్తాయి
– డిసిసి అధ్యక్షుల శిక్షణ  కార్యక్రమంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి

వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ సిద్దాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరిలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఈ తరగతులు సహాయపడతాయన్నారు. గాంధీజీపై లాఠీలు ఎత్తడానికి బ్రిటిషర్లు భ‌యపడ్డారని, దేశభక్తులమని అనుకునే కొందరు తూటాలతో గాంధీని చంపారని విమర్శించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, గాంధీ ఆలోచనలపై కూడా భిన్నాభిప్రాయాలు చెప్పినవారు ఉన్నారని తెలిపారు. ‘భిన్నాభిప్రాయాలు చెప్పిన వారిని తరిమేస్తే మనకే నష్టం.. అందరూ కలిసి పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చు’ అని రేవంత్‌ అన్నారు. డీసీసీ పదవి ఎంతో విలువైనది.. వచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకోవద్దు. డీసీసీ నుంచి పీసీసీ కావచ్చు. ఎమ్మెల్యే కావచ్చు.. ఎంపీ కావచ్చు.. సీఎం కావచ్చని  రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. 2.5 శాతం వోట్ల నుంచి 40 శాతం వరకు కాంగ్రెస్‌ ‌పార్టీని తీసుకొచ్చామన్నారు. డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్‌లో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే స్వేచ్ఛ ఉందని అన్నారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి పార్టీలో లేదన్నారు. మనలో మనం కొట్లాడుకుంటే పార్టీ కోసం కష్టపడే లక్షలాది కార్యకర్తలకు అన్యాయం చేసినవాళ్లమవుతామన్నారు. ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత, ప్రజలతో అనుసంధానమే లక్ష్యంగా తెలంగాణ, ఏపీకి చెందిన డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  పార్టీలో అందరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. మెరిట్‌ ఉన్న వారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న వారిని వెతికి మరీ పదవులు ఇచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. నాయకుల ప్రతీ కదలికను గమనిస్తూనే ఉంటామని, మెరిట్‌ ‌కోటా తప్ప కాంగ్రెస్‌లో ఏ కోటా లేదని స్పష్టం చేశారు. మెరిట్‌ ‌కోటాలో పాస్‌ అయితేనే పదవులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చాలా విలువైనదని.. ఈ పదవిని దుర్వినియోగం చేస్తే దేవుడు కూడా కాపాడలేడన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఉన్నతికి తొలిమెట్టు అని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌ అ‌గ్రనాయకులను అవమానపరచాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాహుల్‌ ‌గాంధీకి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్‌ ‌వైఎస్‌ ‌షర్మిలపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. రాజకీయ వారసత్వం నుంచి షర్మిల వచ్చినా ఆమె అవకాశాలను తీసుకోలేదన్నారు. ముళ్లబాటలో కూడా ఏపీలో కాంగ్రెస్‌ ‌కోసం కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్ళి రాజకీయాల్లో రాణించాలని షర్మిల చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. కాగా, శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరయ్యారు. రెండు రాష్టాల్ర నుంచి సుమారు 70 మంది డీసీసీ అధ్యక్షులు  శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *