సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాల‌న‌

– ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకుంటున్నాం
– రెండేళ్ల‌లో సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం
– ప్ర‌జారంజ‌క పాల‌న‌ను అందిస్తున్నాం
– మా ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో సంతృప్తి
– ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాలే నిద‌ర్శ‌నం
– మీడియాతో మంత్రి పొంగులేటి
హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7 : అన్ని వ‌ర్గాల‌కు అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో స‌మ ప్రాధాన్య‌తనిస్తూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింద‌న్నారు. రెండేళ్ల పాల‌న‌కు ప్ర‌జా ఆమోదం సంపూర్ణంగా ఉంద‌ని కంటోన్మెంట్ , జూబ్లీహిల్స్ ఫ‌లితాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో ముచ్చ‌టించారు. రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెడుతున్నాం, రెండేళ్ల కాలం మ‌రీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  నేతృత్వంలో రెండేళ్ల‌లోనే సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ది దిశ‌లో ప‌రుగులు పెట్టిస్తున్నా మ‌న్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన నాటి అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజ‌క‌ పాలన సాగిస్తున్నామ‌న్నారు. ఎక్కడాలేని ఎవరూ ఊహించని అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామ‌న్నారు. సన్నబియ్యం ఇందిర ఇండ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయి. అభివృద్ధి సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి ర‌ధం పరుగులు తీస్తోంద‌న్నారు. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ఏర్పడిన వెంట‌నే ఆరు గ్యారంటీల అమ‌లుకు శ్రీ‌కారం చుట్టాం. వీటిలో నాలుగు గ్యారంటీల‌ను అమ‌లు చేశాం. మిగిలిన రెండు గ్యారంటీల‌లో కొన్నింటిని పాక్షికంగా అమ‌లు చేశాం. ఆర్దిక ఇబ్బందుల కార‌ణంగా ఈ రెండు గ్యారంటీల‌ను పూర్తిగా అమ‌లు చేయ‌లేదు. అయినా వాటిని ప్ర‌జ‌ల‌కు అందించేందుకు య‌త్నిస్తామ‌న్నారు. ఎన్నిక‌ల్లో హామీలు ఇవ్వ‌క‌పోయినా ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌లు ప‌ధ‌కాల‌ను అమ‌లు చేశామ‌న్నారు. వ్యవసాయ‌, పారిశ్రామిక రంగాల‌లో గ‌ణ‌నీయ‌మైన ప్రగ‌తిని సాధిస్తున్నాం. ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచింద‌న్నారు. రాష్ట్రాన్ని దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్య‌మంత్రి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంద‌న్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌న్నారు.
ఒక‌వైపు ప్రపంచ న‌గ‌రాల‌తో పోటీ ప‌డే ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకొని మ‌రోవైపు పేద‌ల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫ‌లాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాల‌న సాగిస్తోంద‌న్నారు. పాల‌న‌లో పార‌ద‌ర్శక‌త‌, అభివృద్దిలో ఆధునిక‌త‌, సంక్షేమంలో స‌రికొత్త చ‌రిత్రను రాస్తూ తెలంగాణ‌ను రెండేళ్ల‌లో దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిల‌బెట్టామ‌న్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు పూర్తి సంతృప్తి ఉందన్న విష‌యం ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌లే రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లో తొలిసారి జ‌రిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌లతో పాటు ఇటీవ‌ల జ‌రిగిన జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ విజ‌య‌మే దీనికి నిద‌ర్శ‌నమ‌న్నారు. ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండ‌మ్ అని ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తుచేసుకుంటే మా ప్ర‌భుత్వానికి, సిఎం రేవంత్‌రెడ్డి  పాల‌న‌కు ఎన్ని మార్కులు ఇవ్వ‌వ‌చ్చో అంద‌రికీ అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. రాష్ట్రంలో ఈ రెండేళ్ల‌లో రెవెన్యూ, హౌసింగ్, స‌ర్వే త‌దిత‌ర విభాగాల‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల తీసుకువ‌చ్చాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ స‌మస్య‌ల‌ను వీలైనంతవ‌ర‌కు త‌గ్గించ‌డం, అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వ‌డం త‌మ ప్ర‌భుత్వం ముందున్న ప్ర‌ధ‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇప్ప‌టికే ఈ ల‌క్ష్య‌దిశ‌గా తాము చేప‌ట్టిన చ‌ర్య‌లు విజ‌య‌వంతంగా అమ‌లు అవుతున్నాయ‌న్నారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page