– జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో రాష్ట్రం అట్టడుగుకు
– కేసీఆర్ పాలనలో దేశంలోనే నెంబర్ వన్
– రేవంత్ రెడ్డి అనుభవ లేమి, అరాచకత్వమే కారణం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. సెప్టెంబర్ 2025లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమని అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎంత విధ్వంసానికి గురయిందో చెప్పేందుకు ఇది ఒక నిదర్శనమని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయం నుండి ఐటీ వరకూ అన్ని రంగాలకు ప్రభుత్వం గట్టి దన్ను ఇవ్వడంతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసి రికార్డులు తిరగరాసిందని కేటీఆర్ తెలిపారు. కానీ, నేడు కాంగ్రెస్ పాలనలో పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు. అరాచకత్వం, అవినీతి, అనుభవ లేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోందంటూ ఈ విధ్వంసాన్ని ఆపడానిక వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




