కాంగ్రెస్ గూండా రాజ్యం

– పోలీసుల అండ‌తో కిడ్నాప్‌లు
– ప్ర‌జా తీర్పును ప్ర‌భుత్వం గౌర‌వించాలి
– ఛైర్మ‌న్ల ఎన్నిక‌లో మంత్రుల  ప్ర‌మేయం
– కేటీఆర్ ధ్వ‌జం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16: వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలను బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ప్రభుత్వం, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని గూండాల మాదిరిగా వ్యవహరించడం శోచనీయమన్నారు. స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలే గెలిచిన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలకు పాల్పడడం, ఎక్కడికక్కడ దాడులకు తెగబడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోర్రూర్, జనగామ, క్యాతనపల్లి, కాగజ్‌నగర్ వంటి అనేక పట్టణాల్లో పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని పలు పట్టణాల్లో అభ్యర్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ గూండా రాజ్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. స్వయంగా అధికారులు, పోలీసులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలే నేరుగా అక్రమ పద్ధతుల్లో ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియలో తలదూర్చడంపై ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకొని మరీ పదవులను పొందాలని చూడడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని పేర్కొన్నారు. అనేకచోట్ల కాంగ్రెస్ నాయకులు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులు, పార్టీ మార్పులు, దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పట్టణాల్లో బి.ఆర్.ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. స్పందించని పోలీసుల తీరును చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతుందన్నారు. వెంటనే డీజీపీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కోరం ఉన్నచోట్ల కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలను వాయిదా వేయడం ఎన్నికల సంఘం పనితీరుపై మాయని మచ్చగా నిలుస్తుందని ఆక్షేపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తన క్రిమినల్ మెంటాలిటీతో, గూండాల బలంతో ప్రజల ఆకాంక్షలను, బీఆర్ఎస్ పోరాటాలను ఆపలేదని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *