దేశ వ్యతిరేకతను బయటపెట్టుకున్న కాంగ్రెస్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరఎసఎస్) వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు. అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆరఎఫ్) అనే సంస్థ ఇచ్చిన నివేదికను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత్‌పై పక్షపాతంగా, ప్రేరేపిత వైఖరితో ఈ నివేదికను అమెరికాకు చెందిన సంస్థ విడుదల చేసిందని, ఆ సంస్థ చాలా ఏళ్లుగా భారత్‌పై ద్వేషభావంతో అసంబద్ధమైన కథనాలపై ఆధారపడి ఏకపక్షంగా, భావజాలపరంగా నివేదికలు ఇస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తప్పుపట్టిందని తెలిపారు. ఇలాంటి నివేదికలు ఇవ్వడం ద్వారా కమిషన్ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందన్నారు. భారత్‌పై ఏకపక్షంగా అబద్ధపు విమర్శలు చేయడం పక్కన పెట్టి అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, భారత్ లక్ష్యంగా కొన్ని సంస్థలు దుష్ప్రచారం చేయడం, అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు బెదిరింపులు, భారతీయులపై పెరుగుతున్న వివక్షను ఏమాత్రం పట్టించుకోని ఇలాంటి కొన్ని విదేశీ సంస్థలు పథకం ప్రకారం భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అమెరికాలో భారతీయుల పరిస్థితి దారుణంగా ఉంటే కాంగ్రెస్ వైఖరి మరింత దారుణంగా తయారైందన్నారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. దేశంలో ఏదైనా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి విపత్తు సంభవించినప్పుడు కూడా కాంగ్రెస్ పైశాచికానందం వ్యక్తం చేస్తోందన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో కూడా ఎల్‌పీజీ విషయంలో తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిదని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, లోక్‌సభ స్పీకర్, సాయుధ బలగాలు ఇలా అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని నీచమైన రాజకీయాలు చేయాలని చూస్తోందన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేక, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేక, భారత్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు సాయం చేయాలని విదేశాలకు వెళ్లి రాహుల్ గాంధీ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో దేశానికి వ్యతిరేకంగా విదేశీ సంస్థ ఇచ్చిన తప్పుడు నివేదికలను సమర్థించడం అత్యంత దేశ వ్యతిరేక చర్య అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీని దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థగా మార్చి, విదేశీ అదృశ్య హస్తాలతో కలిసి దేశాన్ని నవ్వుల పాటు చేసి, బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక వైఖరిని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *