అవినీతికే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్

– అప్పుల ఊబిలో పురపాలికలు
– బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
– నర్సాపూర్‌లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపాల్టీల్లో పన్నుల భారం మోపుతున్నారని, డ్రైనేజీ, తాగునీటి సరఫరా సక్రమంగా లేదు.. గల్లీల్లో పారిశుధ్య కార్మికులు కనిపించరు.. కరెంట్ సహా ఎన్నో ఇబ్బందులు కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి పేరుతో పన్నులు పెంచింది.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది.. పన్నులు పెంచినా ఫలితం ఏంటో నేడు పట్టణాల పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది అని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. కేంద్రం లేకపోతే రాష్ట్రంలోని పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం ఎవరు ఇస్తున్నారు.. మన రహదారులు ఎవరు వేశారు.. రైల్వే స్టేషన్లు ఎవరు అభివృద్ధి చేశారు.. వీటికి సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు.

బీజేపీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్కు భయం

ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ గాలి బలంగా వీస్తోందని, రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న విషయం కాంగ్రెస్‌కూ, బీఆర్ఎస్‌కూ అర్థమైందని, ఈ పరిణామాలతో కాంగ్రెస్ భయంతో మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.. మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఈజ్ కాంగ్రెస్-కాంగ్రెస్ ఈస్ ముస్లిం అని వ్యాఖ్యలు చేసిన వారు ఎవరు అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో దేవాలయాన్ని కూల్చి ప్రభుత్వ భూమిపై ఇతర నిర్మాణాలకు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. హిందువుల ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వ భూమిని ముస్లింలకు శ్మశానంగా మార్చే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఆ రోజు ఎమ్మెల్యే రఘునందన్ రావు జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. బీజేపీ దేశాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తోందని, కానీ కాంగ్రెస్ అభివృద్ధి గురించి కాక కుంభకోణాలు, అవినీతికే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి మంత్రిపై అవినీతి ఆరోపణ ఉంది.. కోట్ల రూపాయల కుంభకోణాలు చోటుచేసుకున్నాయని రామచందర్‌రావు చెప్పారు. పురపాలక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోతే పన్నులు పెంచుతారు.. ఈ ప్రభుత్వం ప్రజల జేబుల నుంచి డబ్బు కొల్లగొట్టే ప్రభుత్వంగా మారింది.. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు టాక్స్ టెర్రరిజం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి ఆగాలంటే, మున్సిపాలిటీల్లో పనులు జరగాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. నర్సాపూర్ ప్రజలను కోరేదేమంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. కేంద్ర నుంచి మీ పట్టణానికి అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం అని రామచందర్‌రావు హామీ ఇచ్చారు. ప్ర‌చారంలో ఎంపీ ర‌ఘునంద‌న‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *