దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

– బీసీల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని..

న్యూదిల్లీ, ఆగస్టు 5: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు దిల్లీకి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే దిల్లీకి కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ కీలక నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోరాదని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని తెలిపారు. ఇప్పటికే ముసాయిదాని రాష్ట్రపతికి పంపించామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్లపై నినాదాలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు. విమానంలో దిల్లీ వెళ్లి అక్కడి ఎయిర్‌పోర్టులో బీసీ నినాదాలు చేసినవారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, రాజేష్‌ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *