– వేల కోట్ల సంపాదనలో ఓ ఇద్దరు మంత్రులు
– వారు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లక తప్పదు
– రాష్ట్రానికి పెద్ద శని కేసీఆర్ కుటుంబమే
– అందుకే ఆయన్ను ఫాంహౌస్‌కే పరిమితం చేసిన ప్రజలు
– సీఎంగా రేవంత్ భాష పద్దతిగా లేదు
– జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం మాదే
– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశానిస్ప్రహల్లో ఉన్నారని, వారంతా తిరగబడే రోజులు వచ్చాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడిరచారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో గురువారం ఆయన చిట్‌చాట్ మాట్లాడారు. కేబినెట్‌లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగుల ఆసరాగా వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై నివేదికలు తెప్పించుకుంటున్నామని, వారి బాగోతాన్ని త్వరలోనే బయటపెడతామని బండి చెప్పారు. కాంగ్రెస్ కరప్షన్, అక్రమాలపై బీజేపీ పోరాటం చేయబోతోందని తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పంచాయతీలకు సీఎం బిచ్చమేస్తున్నారా అని ప్రశ్నించారు. పంచాయతీలకు కేంద్రం నుండి రూ.3 వేల 5 కోట్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రే చెబుతున్నారని, కేంద్రం ఏమిచ్చిందని మళ్లీ ఎదురుదాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని తెలంగాణలో లేదు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ కుటుంబమే.. ప్రజలు దీన్ని గమనించే ఆయన్ను ఫాంహౌజ్‌కే పరిమితం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకొకరు బాగుపడలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే ముమ్మాటికీ దోషి కేసీఆరేనని, 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు చాలని అంగీకరించిన వ్యక్తి ఆయనేనని, అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే ఈ విషయం చెప్పారని తెలిపారు. నాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు తాము సిద్ధమన్నారు. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష సరైంది కాదన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే ముందు జాగ్రతగా ఉండాలని.. ఇలా దిగజారి మాట్లాడితే ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గుతుందని హితవు పలికారు. మాజీ సీఎంపై రేవంత్ రెడ్డి వాడిన భాష మీదే రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. కేసీఆర్‌ను రేవంత్ తిట్టడం వెనక సింపతీ పెంచే కుట్ర దాగుందని.. ఇందుకోసం మరీ ఇంత జుగుప్సాకరమైన భాష అవసరం లేదని అన్నారు. గతంలో కేసీఆర్ మాట్లాడితే తాము ఖండిరచామని, ఇపుడు సీఎం రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం అని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై చర్యలేవీ?
కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై నివేదికలు తెప్పించుకుని పంపినా చర్యల్లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే రూ.9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణకు పరిమితం ఎందుకు చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎవరిని కాపాడేందుకు రూ.లక్ష కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదన్నారు. కాగా, తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా సుమోటోగా తీసుకుని ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందని ఆరోపించారు. తాము అధికారంలోకొస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తోంది బీజేపీయేనని, బీఆర్‌ఎస్ విమర్శలకే పరిమితం తప్ప పోరాటాలు చేసిందే లేదని విమర్శించారు.
పంచాయతీ ఫలితాలను ఏ పార్టీకీ ఆపాదించలేం
పార్టీ గుర్తు లేకపోవడంవల్ల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఏ పార్టీకి ఆపాదించలేమని, పార్టీ గుర్తుతో అయితే కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 108 సర్పంచ్ స్థానాలు గెలవడంతోపాటు ఎక్కువ పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచామని తెలిపారు. కేసీఆర్ సర్కార్ బండి అన్నారు. రేవంత్ కూడా జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదని, ఆరు గ్యారంటీలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది.. ఎంతమందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారో వివరాలు చెప్పాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. ఈసారి బీజేపీ సింగిల్‌గా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ ఎగిరిపడుతుండగా బీజేపీ కార్యకర్తలు కసితో ఉన్నారని, ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక జరిగితే బీజేపీని గెలిపించుకుంటారని చెప్పారు. మోదీ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నామని, పథకాలను మైనారిటీలు సహా అర్హులందరికీ అందిస్తున్నామన్నారు. భారత్‌లో మైనారిటీలపై దాడులు జరగడం లేదనే విషయాన్ని ప్రపంచమంతా గమనిస్తోందంటూ బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల గురించి ప్రస్తావించారు. రాజాసింగ్ మాట్లాడుతూ ఆయన బీజేపీ నుండి సస్పెండయ్యారని, స్వేచ్ఛా జీవి అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





