– సింగరేణి డైరెక్టర్‌కు బీఆర్ ఎస్ నేతల వినతిప్రతం
– సింగరేణి కార్మికులపై పగబట్టిన రేవంత్
– తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి
– జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం.
– జర్నలిస్టుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
– బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను సింగరేణి డైరెక్టర్ దృ ష్టికి తీసుకెళ్లామని బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు తెలిపారు. శనివారం ఆయన కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ నేతలతోకలిసి కార్మికుల సమస్యలపై సింగరేణి డైరెక్టర్ గౌతమ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్ పునరుద్ధరించిన సంగతిని గుర్తుచేశారు. 40 వేల సింగరేణి ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులే.. వారిని నియమించి ఉద్యోగులను, సంస్థను కాపాడింది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు, అలియాస్ పేర్లను కన్సిడర్ చేస్తాం అంటూ హామీలను ఇచ్చి రెండేళ్లలో రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టారు. కార్మికులపై పగపట్టినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. కాళ్ళు లేని వారిని, కండ్లు కనిపించని వారిని, గుండెకు బైపాస్ సర్జరీ అయినా వారిని కూడా ఉద్యోగం చెయ్యాలని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. కార్మిక కంటక ప్రభుత్వం, కార్మికులను గోసపెట్టుకునే ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వమని విమర్శించారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతున్నది. కరంట్ కు బొగ్గును తీసుకోని బిల్లులు చెల్లించడం లేదు. సింగరేణి అప్పుల పాలయ్యే పరిస్థితి. జీతాలకు డబ్బులు లేక ఓడీ తీసుకుని జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొన్నదన్నారు. రేవంత్ వచ్చాక సింగరేణి రూ.50, 000 కోట్ల అప్పుల్లో మునిగిందన్నారు. ఆర్ధిక మంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయడం తగునా భట్టి గారూ అంటూ ప్రశ్నించారు. నీ సోకుల కోసం ఫుట్ బాల్ ఆడటం కోసం సింగరేణి రూ.110 కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫుట్ బాల్ మ్యాచ్ కోసం వాడిన రూ.110 కోట్ల పై ఎంక్వయిరీ వేసి కారకులను బొక్కలో వేయిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో సింగరేణికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు. భట్టి విక్రమార్క తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే వారందరితో నీ ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడం అక్రమమన్నారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చెయ్యాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు. వారికి ధర్నా చేసే హక్కు లేదా, దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? ఇదేనా మీరు ఇస్తానన్న ఏడవ గ్యారంటీ అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు కేసీఆర్ 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. రిపోర్టింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు అనే తేడా లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇచ్చిన సంగతి గుర్తుచేశారు. మేము అధికారంలోకి వస్తే ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అక్రిడేషన్ కార్డులను 10 వేలకు తగ్గించడం దుర్మార్గం. బీఆర్ఎస్ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణమన్నారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





