వర్ధన్నపేటలో కాంగ్రెస్ ‘మార్క్’ విజయం

– ఫలించిన‌ వెంకట్రామ్ రెడ్డి వ్యూహం

హ‌న్మకొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16 : హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, వరంగల్ ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సమన్వయంతో  వర్ధన్నపేట మున్సిప‌ల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కెఆర్.నాగరాజుతో కలిసి అన్నీ తానై నడిపించి పార్టీని మెజారిటీ దిశగా తీసుకెళ్లారు. కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు తీసుకున్న తక్కువ సమయంలోనే పార్టీ శ్రేణులను ఏకం చేసి విజయం అందించారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పదవికి పాలకుర్తి సారంగపాణి ని ఎంపిక చేయడంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.  స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నేతావత్ శిభారాణిని తిరిగి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంలోను, ఆమెను వైస్ చైర్మన్‌గా నియమించడంలోను తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. మొత్తం 12 వార్డులలో కాంగ్రెస్,  బిఆర్ఎస్ చెరో ఆరు స్థానాల్లో నిలవగా, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఎక్స్-అఫీషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.   ఈ విజయం సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో రేయింబవళ్లు శ్రమించిన కౌన్సెలర్లకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు జిల్లా నాయకత్వంతో కలిసి చేసిన కృషి ఈ విజయానికి పునాది అని కొనియాడారు.
పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్వయంగా 4, 14, 17, 18, 19, 20 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన చేసిన కృషి వల్ల 4వ వార్డు (ఏకు దివ్య), 19వ వార్డు (కొయ్యడ శ్రీనివాస్), 17వ వార్డు (బొచ్చు సుభద్ర), 20వ వార్డు (పాలకుర్తి శ్రీనివాస్) అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సగానికి పైగా అభియారతులకు ఆర్ధిక సహాయాన్ని అందించి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పడంలో ఆయన వ్యూహం విజయవంతమైంది.  గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులను ఏకం చేయడంలో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ముఖ్యంగా పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను సర్పంచులుగా గెలిపించాలని ఆయన ఇచ్చిన పిలుపుకు గ్రామాల్లో మంచి స్పందన లభించింది. అనేక గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికవ్వడంలో ఆయన సమన్వయం ప్రధాన భూమిక పోషించింది. హన్మకొండ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి చేరవేసేలా చూడటమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, పొన్నం ప్రభాకర్ గార్ల వంటి నాయకులతో కలిసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ముందుకు నడిపిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *