గ్యారంటీలు, హామీల పేరుతో హడావుడే
సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే సభ
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‌కు చెల్లు చీటీ
కాంగ్రెస్ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విసుర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి అంటూ మరోసారి తెలంగాణ ప్రజలను మాయచేయాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. పదేపదే ప్రజలను మభ్యపెట్టే నినాదాలు చేసే కాంగ్రెస్.. వాటికి విరుద్ధంగా పనిచేయడమే దాని నిజమైన ధోరణి అని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. జై బాపు అంటూ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం, గ్రామాభివృద్ధి పనుల బిల్లులకు రూ.1,200 కోట్లు పెండిరగ్‌లో పెట్టడం ఇవన్నీ గాంధీజీ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. జై భీమ్ అంటూ నినదిస్తున్న కాంగ్రెస్ వాస్తవంగా లగచర్ల, కొండగల్ వంటి ప్రాంతాల్లో గిరిజనుల భూములు లాక్కుని పోడు భూములపైకి బుల్డోజర్లు పంపి ఎస్టీ రైతులపై కేసులు బనాయించి, గురుకులాల మూసివేతలతో దుర్మార్గంగా వ్యవహరించిందని తెలిపారు. జై సంవిధాన్ అని పఠించే ముందు కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను గమనించాలని సూచించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి రాజ్యాంగంపై బోధనలు చెప్పే అర్హత లేదన్నారు. ఇవన్నీ మరిచినట్టుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు తెలంగాణకు వచ్చారని, కానీ ఖర్గే గారూ,, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహిస్తోంది? ఇంకా దోచుకోవడానికి ఏమి మిగిలింది.. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయి అనేదే ప్రజల మనసులో ఉన్న అసలైన ప్రశ్న అని ఆయన అన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు, 13 హామీలు అంటూ భారీగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు. కుల గణన పేరిట బీసీలకు అన్యాయం చేసి, ముస్లింలను బీసీ కోటాలో చేర్చడమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ సభ నిర్వహించేది సామాజిక న్యాయం కోసం కాదు.. సామాజిక న్యాయానికి తూట్లు పొడవడానికేనని, తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరు అని రామచందర్‌రావు స్పష్టం చేశారు.





