– మహిళ అని కూడా చూడకుండా హేళన
– ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత
హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 11: జూబ్లీహిల్స్‌లో వోటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించారని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు. కాంగ్రెస్‌కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి అని చూడకుండా బూతులు మాట్లాడతారా అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న రౌడీయిజం భరించలేక మాగంటి సునీత ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు వోటర్లు భయపడవద్దని సూచించారు. విజ్ఞతతో వోటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు వోటమి భయం పట్టుకుందని మాగంటి సునీత అన్నారు. స్టేట్‌లో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీహిల్స్‌లో తిరుగుతున్నారని తెలిపారు. సురేశ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు జూబ్లీహిల్స్‌లో ఏం పని అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్‌ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లను కూర్చోనివ్వడం లేదని తెలిపారు.పోలింగ్ బూతుల్లోని టేబుళ్లను బయట పడేస్తున్నారని తెలిపారు. పోలీసులు వారి దగ్గరి టేబుల్స్, చైర్లు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. బిర్యానీల్లో డబ్బులు పెట్టి వోటర్లకు ఇస్తున్నారని చెప్పారు. బిర్యానీ ప్యాకెట్లను చూసి కూడా పోలీసులు వొదిలేస్తున్నారని తెలిపారు. కొన్ని బూత్‌ల్లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వికలాంగులకు వీల్‌చైర్స్ కూడా సరిపడేంతగా పెట్టలేదని తెలిపారు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులకు దిగుతున్నారని అన్నారు.
ఓటింగ్‌కు ఇంకా నాలుగు గంటల సమయం ఉండగా.. దయచేసి ప్రజలంతా బయటకొచ్చి వోట్లు వేయాలని మాగంటి సునీత కోరారు. జూబ్లీహిల్స్ వోటర్లు చైతన్యం ప్రదర్శించి వోటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీరాజ్యంగా మార్చేశారని తెలిపారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి రేపు నీ సంగతి చెప్తానని నన్నే బెదిరించారని పేర్కొన్నారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని అడ్డుకోవాలంటే కేసీఆర్ పార్టీని గెలిపించాలని కోరారు. నా భర్త మాగంటి గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు.. కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని సునీత అన్నారు. 13వ తేదీవరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి.. 14వ తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
సునీత వ్యాఖ్యలు సత్యదూరం : మంత్రి పొన్నం
సునీత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాజకీయ సానుభూతి ప్రకటనలు కురిపిస్తున్నారని అన్నారు. సునీత వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లేనని అన్నారు పొన్నం. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ అభ్యర్థి తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు పొన్నం. ప్రజలు తమ ఇష్టానుసారం వోటు వేసే హక్కు ఉందని.. పోలింగ్ టైంలో స్థానికేతర నేతలు ఉంటే కేసు పెట్టాలని అన్నారు. అయితే.. ఉదయం పోలింగ్ కాస్త నెమ్మదిగా జరిగినా.. గంట గంటకి నెమ్మదిగా వోటింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్నం వొచ్చే వరకు పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి వరకు 40.20 శాతం పోలింగ్ నమోదయ్యింది. చివరి రెండు గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది వోటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




