-అందుకే అవినీతి కేసుల్లో విచారణలు పక్కదారి
-మండిపడ్డ కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా, దరిద్రంగా ఉందని ధ్వజమెత్తారు. తల నరికినా.. పైసా లేదని సీఎం రేవంత్ అంటున్నారని, అందువల్లే ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లాగే డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకుంటున్నారన్నారు. ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ’ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని పదేళ్ల నుంచి అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి బీఆర్‌ఎస్ బరిలో దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను జైలుకు పంపుతానన్న రేవంత్ రెడ్డి మాటలు ఏమైయ్యానని నిలదీసారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను జైలుకు పంపారా? కాలేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో జైలుకు పంపారా? డ్రగ్స్ కేసులో జైలుకు పంపారా? ఫాం హౌస్ కేసులో జైలుకు పంపారా? కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తులు కాబట్టే కేసీఆర్ ఫ్యామిలిలో ఎవరినీ జైలుకు పంపలేదని ఇరు పార్టీలపై బండి సంజయ్ ధ్వజమెత్తారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలలో ఓడిన తర్వాత కేసీఆర్ ఎక్కడా కనబడలేదని.. అయితే ఫామ్ హౌజ్ లేదా యశోదా ఆసుపత్రిలో మాత్రమే కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫామ్ హౌజ్ పాలను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్న ఆయన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో 100 సీట్లు వస్తే ఇప్పుడు 600కు పైగా స్థానాలొచ్చాయన్నారు. లీకు వీరులు అన్ని పార్టీలోనూ ఉన్నారని ఈ సందర్భంగా కౌంటర్ వేశారు. ఆంధప్రదేశ్‌లో కూటమి పాలన అద్భుతంగా సాగుతోందని బండి సంజయ్ కొనియాడారు. ’
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.