‌ప్రజా తీర్పును కాలరాస్తున్న కాంగ్రెస్‌

‌- పోస్టింగ్‌ల కోసం తొత్తుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసులు
– క్యాతన్‌పల్లిలో బలమున్నా మంత్రి వివేక్‌ ‌దుర్మార్గం
– వచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే..అప్పుడు చూపిస్తాం
– మీడియాతో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు
– జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ

ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్న‌దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రాబోయేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేనని, వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆదిలాబాద్‌ ‌జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ‌ను గురువారం పరామర్శించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్‌లో 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్‌ఎస్‌ ‌గెలిస్తే ప్రజలు తీర్పును అంగీకరించకుండా చైర్మన్‌ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్‌ ‌చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. బాల్క సుమన్‌, ‌కోవ లక్ష్మిలను లోపలికి పంపించకుండా కేవలం కాంగ్రెస్‌ ‌మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై దాడి చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులే దాడులు చేశారంటూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బాల్క సుమన్‌ను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతన్‌పల్లి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్‌ ‌లలో బీఆర్‌ఎస్‌ ‌నాయకులను, కౌన్సిలర్లను పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. జనగామలో వోటింగ్‌ ‌కోసం బీఆర్‌ఎస్‌ ‌కౌన్సిలర్‌ ‌చేయి పైకెత్తితే వెనుక నుంచి కాంగ్రెస్‌ ‌కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారని, దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. కాంగ్రెస్‌ ‌నేతలే పథకం ప్రకారం దాడి చేసి బీఆర్‌ఎస్‌ ‌నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. బలం లేనిచోట కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుందో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి తీరు జుగుప్సాకరంగా ఉందని హరీశ్‌ ‌విమర్శించారు. పోస్టింగ్‌ల కోసం బీఆర్‌ఎస్‌ ‌నేతలను వేధిస్తే ఊరుకునేది లేదని, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం చెల్లించుకుంటారని పోలీసులను మాజీ మంత్రి హెచ్చరించారు. రాహుల్‌ ‌గాంధీ..  రాజ్యాంగం ఏమైందో చెప్పాలి అని డిమాండ్‌ ‌చేశారు. కాగా, జైల్లో ఉన్న సుమన్‌ను హరీశ్‌ ‌రావుతోపాటు ఎమ్మెల్యేలు అనిల్‌ ‌జాదవ్‌, ‌కోవ లక్ష్మి, మాజీ మంత్రి రామన్న పరామర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *