– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మారి్చ 23ః కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా గ్యారంటీలన్నింటినీ పక్కనబెట్టి అమలు చేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్లు విడుదల చేసి లక్షలాది కుటుంబాలను నమ్మించిందని, అధికారంలోకి వచ్చాక వాటి అమలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రైతులకు ఇంకా రైతు భరోసా కింద ఎకరానికి రూ.45,000 వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని, దాదాపు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండటంతో విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని తెలిపారు. దివ్యాంగుల పెన్షన్లు, మహిళల పెన్షన్లు, రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. తాము ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున ప్రశ్నించడానికి, వారి వాణిని వినిపించడానికి బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టామని చెప్పారు. తమను అసెంబ్లీ వద్ద అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమన్నారు. దాదాపు తొమ్మిది పోలీస్ స్టేషన్లలో 800మందికిపైగా కార్యకర్తలను అందులో 150మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి నుంచే తమ నాయకులను గృహ నిర్బంధం చేశారంటూ వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వేలాది కార్యకర్తలను మార్గమధ్యంలోనే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రామచందర్‌రావు హెచ్చరించారు. గ్యారంటీలు, హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
అరెస్టులతో అణచివేయలేరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సహా సీనియర్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతాభావానికి అద్దంపడుతోందన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసించే హక్కు కూడా ప్రతిపక్ష పార్టీలకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టులు, లాఠీచార్జిలతో ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని నిలదీశారు. ప్రజా పాలన పేరుతో యువత, రైతులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలను నిట్టనిలువునా మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కారుకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై ఏమాత్రం లేదనేది సుస్పష్టమన్నారు. రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




