పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో భారీ స్కామ్‌

– రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో కొత్త పాలసీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కుంభకోణానికి తెర లేపారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభకోణమన్నారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూముల కుంభకోణానికి కాంగ్రెస్‌ పాల్పడుతోందన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న 9,292 ఎకరాల భూమిపై రేవంత్‌ కన్నేశారని, కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువ చెల్లించి రెగ్యులరైజ్‌ చేసుకోవాలని ఈ పాలసీ ద్వారా కుంభకోణం చేయబోతున్నారన్నారు. గతంలో తమ ప్రభుత్వం కనీసం 100% నుండి అత్యధికంగా 200% ఎస్‌ఆర్‌ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశిస్తే కాంగ్రెస్‌ కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందంటూ కొత్త పాలసీ తెచ్చిందన్నారు. కేబినెట్‌ మీటింగ్‌లో ఈ భారీ స్కామ్‌కు తెరలేపిందని, ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్‌ రెడ్డి అన్నదమ్ములు, అనుచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఆగమేఘాల మీద కేవలం ఏడు రోజుల్లో దరఖాస్తు, ఏడు రోజుల్లో ఆమోదం, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్‌ అంటూ హడావుడి చేస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ అనేది కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌కు ఏటీఎంగా మారిందన్నారు. ఈ భూములు కొనుగోలు చేసిన, రెగ్యులరైజ్‌ చేసుకున్న పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, ప్రజల ఆస్తిని అప్పనంగా కొట్టేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ అంశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని కేటీఆర్‌ తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ లావాదేవీలన్నింటిపై పూర్తి విచారణ ఉంటుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి అవినీతి కోసం ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులు పడొద్దని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు రూపొందించిన టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని పారిశ్రామిక భూములు అమ్మేందుకు కాంగ్రెస్‌ వాడుతోందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *