బిజెపిని ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉంది..

కొత్త నాయకత్వాన్ని తీసుకుని వొస్తాం
సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగిస్తాం..
కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ

అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర ఏ‌ప్రిల్‌ 19 : ‌బీజేపీని ఓడించగలిగే సత్తా కేవలం కాంగ్రెస్‌ ‌కు మాత్రమే ఉందని ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు.  గుజరాత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ నైతిక్థసైర్యం కోల్పోయినట్టు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  గుజరాత్‌కు చెందిన ఓ వార్తా సంస్థతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీని ఒక్క కాంగ్రెస్‌ ‌మాత్రమే ఓడించగలదనే విషయం ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. దీనిపై జిల్లాలకు చెందిన సీనియర్‌ ‌నేతలను తాను కలుసుకున్నానని, చక్కటి చర్చలు జరిగాయని తెలిపారు. పార్టీలోని అంతర్గత సవాళ్లను పరిష్కరించేందుకు రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని పరిచయం చేస్తామని చెప్పారు.

ఇటీవల రాహుల్‌ ‌గాంధీ మోడాసాలో జరిగిన కాంగ్రెస్‌ ‌జిల్లా కార్యకర్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇదే విషయం స్పష్టం చేశారు. పార్టీ వ్యూహాలను వివరిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గుజరాత్‌లో పార్టీని పునర్వవస్థీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను రాహుల్‌ ‌ప్రస్తావిస్తూ, దీనిపై చాలా నెలలుగా పార్టీ సీనియర్‌ ‌నేతలు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గేతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పోరాటం కాదని, సైద్ధాంతిక పోరాటమని అన్నారు.

నాయకుల మధ్య పోటీ వినాశకరమని, నిర్మాణాత్మకం కాదని నేతలు తనకు చెప్పారని అన్నారు. పార్టీలో నాయకత్వ సవాళ్లను గురించి మాట్లాడుతూ, గుర్రాలలో రెండు రకాలు ఉంటాయని, ఒకటి రేసులకు ఉద్దేశించినవని, రెండో రకం పెళ్లిళ్లకు ఉద్దేశించినవని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కొన్నిసార్లు వెడ్డింగ్‌ ‌హార్స్‌లను రేసులకు, రేసింగ్‌ ‌హార్స్‌లను పెళ్లిళ్లకు పంపుతున్నట్టు నాయకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని రాహుల్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *