స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత తీసుకుంటా..
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

స్వ‌తంత్ర‌ పోరాటంలో వెనకడుగు వేయని ధీరోదాత్తులు ఆదివాసీలు, గిరిజనులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు.. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయామని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చార‌ని తెలిపారు. హక్కులను స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని డిప్యూటీ సీఎం అన్నారు. నాగార్జున సాగర్‌లో నిర్వ‌హించిన ఆదివాసీ ప్రజాప్రతినిధుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొప్పుల రాజు, ట్రైకార్ చైర్మ‌న్ బెల్లయ్య‌ నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ వొస్తే రైతు భరోసా ఉండదని ప్రచారం చేశారు కానీ మేము 10,000కు అదనంగా 2000 కలిపి రూ.12000 ఇవ్వబోతున్నామ‌ని అన్నారు.

దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా భూమిలేని నిరుపేదలకు జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబోతున్నామ‌ని,  ఒక్కో విడ‌త రూ.6000 చొప్పున సంవత్సరంలో రెండు విడ‌త‌లుగా రూ.12000 భూమిలేని పేదల ఖాతాల్లో జమ చేస్తామ‌ని తెలిపారు. గిరిజనుల కోసం తెచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామ‌ని, అటవీ సంపదలో గిరిజనులకు హక్కులు అన్ని ఇందిరమ్మ రాజ్యంలో వొస్తాయ‌ని చెప్పారు. ఐటీడీఏలకు పునరుర్జీవం కల్పిస్తామ‌ని, అందుకు కావలసిన బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.  నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి  స్వయం ఉపాధిని కల్పిస్తామ‌న్నారు. భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, సామాన్యుల హక్కులను కాల రాయాలని పెద్ద కుట్ర జరుగుతోంద‌ని, రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుంది రాహుల్ గాంధీ ఈ మార్గంలో వేగంగా నడుస్తున్నారని, అంతే వేగంగా కాంగ్రెస్ శ్రేణులు నడవాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *