– కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం
– అన్నివర్గాల ప్రజలను గోస పెడుతున్న కాంగ్రెస్
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: అవ్వ తాతలకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. మంగళవారం కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్ పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానించి ప్రసంగించారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాసంగి రైతుబంధు పడ లేదు. 2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నదన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది.. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? కొత్తవి దేవుడెరుగు, ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా నెలలతరబడి పెండింగ్ లో పెట్టి పేదల పెళ్లిళ్లకు సాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఆపివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. బిల్లులు ఇవ్వాలని అడిగిన పాపానికి సర్పంచులను జైలుపాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహిం చకుండా, ప్రత్యేక అధికారుల పాలన తెచ్చి గ్రామాలను ఆగం చేశారన్నారు. గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు లీవులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం స్ట్రీట్ లైట్స్ నిర్వహణ లేక గ్రామాలు చీకటిమయం అయిపోయాయి. పారిశుధ్యం పడకేసి విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టెనా లేదు. పారిశుధ్య లోపం వల్లే గజ్వేల్ ప్రాంతంలో చాలామంది డెంగ్యూ వంటి విషజ్వరాలతో చనిపోయారన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకప్పుడు కరువు, వలసలకు నిలయమైన గజ్వేల్ ను.. దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారే. ఆ అభివృద్ధిని కాపాడుకోవాలన్నా, భవిష్యత్తులో గ్రామాలు బాగుపడాలన్నా అది మళ్ళీ కేసీఆర్ తోనే సాధ్య మవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, చిత్తుగా ఓడించాలి. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. అందరి కష్టాలు తీరుతాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




