– ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
– నగరాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు గట్టి గుణపాఠం చెబుతారన్నారు. ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను అప్యాయంగా పలకరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ హైదరాబాద్ మహా నగరాభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. కొన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను చూపించి నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు అవకాశమిచ్చిన ప్రజల ఆశలు, భావితరాల ఆకాంక్షలే అజెండాగా అత్యంత పారదర్శకతతో కూడిన పాలనను తమ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి నిరంతరం పాటుపడుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉండి, నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం తపించే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




