అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫ‌లం

– రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు
– మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌ను గెలిపించాలి
– హామీల‌ను ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు
– తెచ్చిన అప్పుల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌లేదు
– ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 28: రెండు సంవత్సరాాల్లో అన్ని రంగాల్లో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడి రానున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అద్భుతమైన విజయం సాధించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో బుధ‌వారం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన అనుచరులతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరగా పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  ప్రజల గురించి పట్టించుకునే తీరిక, ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, అందుకే ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిందని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పి మున్సిపల్ ఏన్నికల్లో బిఅర్ ఏస్ వెంట నిలబడతారని కెటిఅర్ అశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అందరు సమిష్టిగా పోరాడాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, 12 ఏండ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా టైంపాస్ చేస్తున్నాయని, అందుకే కాంగ్రెస్, బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని  అన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని వ్యాఖ్యానించారు. హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. కేవలం పరిపాలన చేతగాక అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించిందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మించామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టారా అని ప్రశ్నించారు. ఆ అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా? సంక్షేమంపై ఖర్చు చేశారా? అని నిలదీశారు. తిరిగి పార్టీలోకి వచ్చిన ఆరూరి రమేష్‌కు కేటీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో రానున్న రోజుల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. గతంలో పార్టీ నాయకులతోపాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు వెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని రమేష్‌ను కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *