– రెండో విడతలోనూ బీఆర్‌ఎస్‌కు అద్భుత ఫలితం
– కాంగ్రెస్ మోసాలతో ప్రజలు విసుగెత్తారు
– పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కెేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు పార్టీ బంగారు బాటలు వేస్తుందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటిన పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందించారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని ప్లలె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకుతోడు, గ్యారెంటీల అమలులో ఘోరమైన మోసాలే కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. నాడు బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం పల్లె పల్లెనా అధికార పార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని అన్నారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు.. రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై నిత్యం బీఆర్‌ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనాలు అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





