మద్యం, డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నాయకులు

– కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు
– ఇవిగో ఆధారాలు.. ఈ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
– ప్రధాన ఎన్నికల అధికారికి హరీష్‌రావు బృందం ఫిర్యాదు

-హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోందంటూ వీడియో, ఫోటో ఆధారాలతో మాజీ మంత్రి హరీష్‌రావు బృందం ఎలక్షన్‌ కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. కొంతమంది పోలీస్‌ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. వీటిపై సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు కూడా చేశామని హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్‌ ఓటర్లు తెలివైన వారని, తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాలను ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకొని వచ్చామన్నారు. సెన్సిటివ్‌ పోలింగ్‌ బూత్‌లలో కేంద్ర బలగాలను పెట్టాలంటూ వాటి వివరాలను కమిషన్‌కు సమర్పించామన్నారు. ముఖ్యంగా మహిళా పోలీస్‌ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించాలని కోరామని ఆయన తెలిపారు. ఓటర్‌ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు పంపించకూడదని, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక బూత్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అధికార పార్టీ నాయకులు తయారు చేసిన ఫేక్‌ ఓటర్‌ ఐడీల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించామని, ఎన్నికల పరిశీలకులకు కూడా కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగం, ఫేక్‌ ఐడీ కార్డుల వివరాలను అందించామని చెప్పారు. అలాంటి అధికారులపై తప్పకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారని హరీష్‌రావు తెలిపారు. యూసుఫ్‌గూడలో కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ఆనుకొని పోలింగ్‌ బూత్‌ ఉందంటూ పార్టీ కార్యాలయం పక్కన పోలింగ్‌ బూత్‌ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రికి రెండేళ్లుగా ఆరు గ్యారెంటీలపై పమీక్షించడానికి టైం దొరకలేదని, ఉప ఎన్నిక వేళ వాటిపై సమీక్షించారని, ఇది కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడమేనని విమర్శించారు. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఎన్నిసార్లు కేబినెట్‌ సమావేశం జరిగింది.. ఎన్నిసార్లు అసెంబ్లీ జరిగింది.. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడూ సమీక్షించలేదంటూ ఆక్షేపించారు. ఆయన దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయని, ముఖ్యమంత్రి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఎవరిని గెలిపించాలనేది ముందే నిర్ణయించుకున్నారని హరీష్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page