– రాహుల్ గాంధీ మోసాన్ని దేశవ్యాప్తంగా ఎండగడతాం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారు
– పార్టీ సీనియర్ నేతల సమావేశంలో హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని దిల్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రిజర్వేషన్ల పెంపు జరగకముందే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందుంచుతామన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన వెంటనే ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే ఈ అంశాన్ని పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరు అని ప్రశ్నించారు. ఆయనకు బీసీలపైన, 42 శాతం రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టవచ్చు కదా అని నిలదీశారు. తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై గళం లేవనెత్తాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20వేల కోట్లను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. బీజేపీ పదేపదే బీసీల మాట చెబుతుంది కానీ వారికి రిజర్వేషన్లు మొదలుకొని నిధుల అమలు దాకా, ఓబీసీ సంక్షేమ శాఖ వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నదని, ఈ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. దీంతోపాటు బీసీలకు బడ్జెట్‌లో ఏడాదికి రూ.20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోపాటు బీసీ డిక్లరేషన్‌లోని హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గ్రామస్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని పార్టీ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా కుల వృత్తులకు సహకారం అందించడం మొదలుకొని ఏర్పాటు చేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచుకున్నారని, వారంతా కేసీఆర్ వెంటే ఉన్నారని హరీష్ రావు అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో సీనియర్ నేతలు బండ ప్రకాష్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, కర్నే ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




