– పథకాలతో సహా అన్నిటికి ఇందిర, రాజీవ్ పేర్లేనా
– వాల్మీకి-అంబేడ్కర్ పేరున్న పథకం పేరు ఎందుకు మార్చారు
– కాంగ్రెస్ రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
– కరీంనగర్ మున్సిపాలిటీలో బిజెపి జెండా ఎగరేస్తాం
– కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 13: ఉపాధి హా పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని నీచ రాజకీయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. వాల్మీకీ-అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) పేరుతో వాజ్‌పేయి తీసుకొచ్చిన ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరా ఆవాస్ యోజనగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఇది ఆ మహానుభావులను అవమానించడం కాదా అని అడిగారు. అలాగే గతంలో ఎన్టీఆర్ టెర్మినల్‌గా ఉన్న హైదరాబాద్ విమానాశ్రయ టెర్మినల్ పేరును తీసేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా ఎందుకు మార్చారని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. గాంధీ పేరును వాడుకున్నారే తప్ప మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కాంగ్రెస్ నేతలు పాతరేసి ఆయన ఆత్మను క్షోభకు గురిచేశారని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను గాంధీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించారు. రాముడి బాటలో నడుస్తామని, రాముడి ఆలయాలను నిర్మిస్తామని తాము చెప్పినప్పుడు కాంగ్రెస్‌కు నొప్పి ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. దేశంలో అనేక పథకాలు కేంద్ర,రాష్ట్ర భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయని, ఈ పథకానికి రాష్ట్ర భాగస్వామ్యం కల్పిస్తే తప్పేముందని నిలదీశారు. ఉపాధి కూలీల వేతనాలను కూడా సకాలంలో ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల
కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర పథకాల ద్వారానే కరీంనగర్ అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. ఈసారి కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టిక్కెట్ల కేటాయింపులో కాషాయ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ తన ఇష్టానుసారంగా కొడుకు, కూతురు, అల్లుడి కోసం కుటుంబ ఆస్తులు పంచినట్లే జిల్లాల ఏర్పాటు చేశారని ఆరోపించారు. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్‌కు ఎందుకు అక్కసు అని ప్రశ్నించిన బండి.. గ్రామాల్లో ఆస్తులు నిర్మించడం తప్పా? రైతులకు మేలు చేసే పథకం కాదా? తెలంగాణకు అదనంగా రూ.340 కోట్లు వస్తుంటే వద్దంటారా అంటూ నిలదీశారు. వీబీజీ రామ్ జీ పథకం కావాలా.. వద్దా.. కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పథకంతో ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందని బండి అన్నారు. ‘ఈ పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల ఉపాధి దొరుకుతుంది. పనుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదు. ఈ పథకం కోసం గతంలో కంటే అదనంగా రూ.17 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. తెలంగాణలో ఈ పథకం అమలుకు అదనంగా రూ.340 కోట్లు ఇవ్వబోతున్నాం. రైతులకు న్యాయం చేసేలా దీన్ని తీసుకొచ్చాం. వ్యవసాయ సీజన్‌లో ఈ పథకం పనులు జరగవు. దీంతో కూలీలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





